కేరళపై కేంద్రం సీరియస్….కావాలంటే ఆ పని చేసుకోవచ్చని రాష్ట్రాలకు లేఖ

కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. కావాలనుకుంటే లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినం చేసుకోవచ్చు అని సూచించింది.
ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రహోంశాఖ రాసిన లేఖలో…కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం(ఏప్రిల్-20,2020)నుంచి కేంద్రం అనుమతించిన కార్యకలాపాలను మాత్రమే రాష్ట్రాలు అనుమతించాలని తెలిపింది.
కేరళకు రాసిన ప్రత్యేక లేఖలో…లాక్ డౌన్ నిబంధనల సడలింపు విషయంలో పిన్నరయి విజయన్ సర్కార్ నిర్ణయాన్ని హోంశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం రెండు జోన్లలో కోవిడ్ -19 లాక్ డౌన్ ఆంక్షలను సడలిచింది. ప్రైవేట్ వాహనాలను సరి, బేసి సంఖ్యలో అనుతించింది. సోమవారం నుంచి హోటల్స్ లో భోజనాలు చేయడాన్ని కూడా అనుతించింది.
స్థానిక వర్క్ షాపులను, కార్లలోని వెనక సీట్లో ఇద్దరు ప్రయాణికులను, టూవీలర్స్ పై ఇద్దరిని అనుమతిస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది లాక్ డౌన్ నిబంధనల ఉలంఘన కిందకి వస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మర్నాడే కేంద్రం ఆంక్షల సడలింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
కాగా లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై ఆదివారం కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాసర్‌గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్… పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్… ఆరెంజ్ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు… కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది.
కేంద్రం లేఖపై స్పందించిన కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ… కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్ నిబంధనలు సడలించాం. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగింది. అందుకే కేంద్రం వివరణ కోరింది. ఇందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుంది. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు.
Also Read | కరోనా సోకినా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? సైంటిస్టులు చెప్పిన రెండు కారణాలు ఇవే!