Pakistan Drones: మరోసారి డ్రోన్ దాడులకు తెగబడిన పాకిస్తాన్..! బర్మార్‌లో బ్లాక్ అవుట్, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక..
ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.

Pakistan Drones: పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. తాజాగా రాజస్తాన్ లోని బర్మార్ లో డ్రోన్లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సాయం తీసుకోవాలని సూచించింది. బర్మార్ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ అవుట్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉల్లంఘనలపై ధీటుగా స్పందించేందుకు క్షేత్ర స్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలు ఇచ్చాడని డీజీఎంవో అధికారి స్పష్టం చేశారు.
Also Read: అది తప్ప.. పాకిస్తాన్‌తో మాట్లాడటానికి ఏమీ లేదు- అమెరికాకు తేల్చి చెప్పిన భారత్..
కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినా పాక్ మళ్లీ రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ కు తగిన జవాబిస్తామని హెచ్చరించారు.
పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7-10వ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో 35-40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. జమ్ము, ఉదంపూర్, పఠాన్ కోట్ పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామన్నారు. ఉగ్ర స్థావరాలపై దాడి చేసిందుకు పాక్ మన పౌరులపై దాడులకు దిగిందన్నారు. డ్రోన్ దాడులకు కౌంటర్ గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలను అటాక్ చేశామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్ కు మరో మార్గం లేదని డీజీఎంవో స్పష్టం చేశారు.