Raj Thackeray: ముంబైకి రా.. సముద్రంలో ముంచి ముంచి కొడతాం.. బీజేపీ ఎంపీకి రాజ్ థాక్రే స్ట్రాంగ్ వార్నింగ్.. మహారాష్ట్రలో రచ్చరచ్చ
మహారాష్ట్రలో భాషా వివాదం తారస్థాయికి చేరింది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రేలు హెచ్చరించారు.

Raj Thackeray: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తాము అంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు.
మరాఠీ ప్రజలను మేమి ఇక్కడ పటక్ పటక్ కే మారేంగే (దాడులు చేస్తాము) అని దూబే అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో మంటలు రాజేశాయి. దీనిపై రాజ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ముంబైలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగారు. ”నువ్వు ముంబైకి రా.. నిన్ను ముంబై సముద్రంలో ముంచి ముంచి కొడతాం” అంటూ నిషికాంత్ దూబేకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాజ్ థాకరే.
మరాఠీ భాష లేదా గుర్తింపుపై ఎలాంటి దాడిని తాను అంగీకరించబోనని థాకరే స్పష్టం చేశారు. “మరాఠీ భాష, మహారాష్ట్ర ప్రజల విషయంలో నేను ఎటువంటి రాజీపడను. మహారాష్ట్రలో నివసించే వారు వీలైనంత త్వరగా మరాఠీ నేర్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి” అని ఆయన అన్నారు.
”మహారాష్ట్ర నివాసితులు మరాఠీ భాషలో మాట్లాడటంలో గర్వపడాలి. కర్ణాటకలో ప్రజలు తమ భాష కోసం పోరాడుతున్నారు. రిక్షా నడిపే వారికి కూడా ప్రభుత్వం భాష విషయంలో అండగా నిలిచింది. అదే విధంగా మీరు ఒక స్తంభంలా ఉండి మరాఠీలో మాత్రమే మాట్లాడండి. నేను మీ అందరినీ అభ్యర్థించడానికి వచ్చింది ఇదే” అని రాజ్ థాక్రే అన్నారు.
హిందీ భాష విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్ థాక్రే తీవ్ర విమర్శలు చేశారు. “మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (పాఠశాలల్లో) హిందీ భాషను తప్పనిసరి చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి హిందీ కోసం పోరాడుతున్నారు. నిజానికి అన్ని పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయాలి. కానీ, మీరు హిందీని తప్పనిసరి చేయాలని మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది” అని ఆయన మండిపడ్డారు.
ముంబై, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల మధ్య చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్ థాక్రే ఆరోపించారు. “కొంతమంది గుజరాతీ వ్యాపారవేత్తలు ముంబై, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల మధ్య చీలిక తీసుకురావాలని ప్లాన్ చేశారు. వారు చాలా సంవత్సరాలుగా ముంబైపై దృష్టి పెట్టారు. వారు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని మహారాష్ట్ర వ్యతిరేకిస్తుందో లేదో వారు చూస్తున్నారు. మనం మౌనంగా ఉంటే హిందీ మొదటి అడుగు అవుతుంది. నియంత్రణ తీసుకొని ప్రతిదీ గుజరాత్‌కు పంపడమే వారి ప్రణాళిక” అని థాకరే అన్నారు.
Also Read: వర్షాకాలంలో బీకేర్‌ఫుల్.. ఈ 3 రకాల కూరగాయలు యమ డేంజర్..! వీటిని అస్సలు తినొద్దు.. ఎందుకంటే..
అంతకుముందు రోజు, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఓ ఇంటర్వ్యూలో తన ప్రకటనలను సమర్థించుకున్నారు. “నేను మళ్ళీ చెబుతున్నాను, నా ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నాను. ఈ దేశం వైవిధ్యమైనది. ప్రజలందరూ తమ ప్రాంతం పట్ల బలమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. మహారాష్ట్ర ఈ దేశంలో భాగమైతే, ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా స్థిరపడవచ్చు. కానీ వారు హిందీ భాష మాట్లాడే వారిని కొట్టారు. నేటికీ, మరాఠీ మాట్లాడే వారిలో 31-32% మంది మాత్రమే ముంబైలో నివసిస్తున్నారు” అని నిషికాంత్ దూబే అన్నారు.
”ఆర్థిక వ్యవస్థకు అపారమైన సహకారాన్ని మహారాష్ట్ర అందిస్తోంది. నేను అంగీకరిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది” అని దూబే అన్నారు.
”పటక్, పటక్ కే మారేంగే” అనే తన వ్యాఖ్యల గురించి దూబే స్పందించారు. “నా మాతృ భాష హిందీ అని నేను గర్విస్తున్నాను. రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే పెద్ద లాట్ సాహబ్‌లు కాదు. నేను ఎంపీని. రాజ్ థాకరే, శివనసే కార్యకర్తల్లా చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోను. నాపై దాడి చేస్తే.. వారు ఎప్పుడు బయటకు వెళ్లినా, ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడి ప్రజలు వారిని కొడతారు. మీరు పేదలను కొడితే, వారు ఏదో ఒకరోజు స్పందిస్తారు. అది హిందీ మాట్లాడే వారు మాత్రమే కాదు. వారు 1956లో గుజరాతీలపై, తరువాత దక్షిణ భారతీయులపై నిరసన తెలిపారు. ఇప్పుడు వారు హిందీ మాట్లాడే వారిపై కూడా నిరసన తెలిపారు. వారి చరిత్ర ఏంటంటే.. అందరూ వారిపై కోపంగా ఉన్నారు. వారు సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని పరిస్థితి ఉంది” అని దూబే అన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. దీంతో ఏప్రిల్‌లో జారీ చేసిన రెస్యలూషన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దేవేంద్ర ఫడ్నవీస్. మూడు భాషల విధానాన్ని పునఃపరిశీలించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపసంహరణ నిర్ణయాన్ని మరాఠీ ప్రజల విజయంగా ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే అభివర్ణించారు. అంతేకాదు విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు.
మహారాష్ట్రలో భాషా వివాదం తారస్థాయికి చేరింది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రేలు హెచ్చరించారు. మరోవైపు మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు పలువురిపై దాడులకు పాల్పడ్డ సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఏ భాషతోనూ తమకు సమస్య లేదని అయితే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి మాత్రమే తాము వ్యతిరేకమని రాజ్ థాక్రే చెప్పారు. మరాఠీ భాష విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో నివసించే వారు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాల్సిందే అన్నారు.