లోక్‌సభ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఆప్రక్రియ పూర్తయ్యేవరకూ ఎన్నికల సిబ్బందికి ఆ పని కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈసీ సిబ్బందికి ఎదురైన ఇబ్బంది మాత్రం మిగిలిన వారిలాంటిది కాదు..ఎందుకంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ కోసం ఏకంగా 483 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ఏర్పాట్లు చేయాలి..కొండలు గుట్టలు దాటుకుంటూ అనేక అడ్డంకులు దాటుకుని వెళ్లి తమ పని పూర్తి చేసుకొచ్చారు. ఇంతకీ అంత కష్టం పడినా అక్కడ ఓటర్లెంత మందో తెలుసా…కేవలం ఒకే ఒక్కరు. సొకేలా తయాంగ్ అనే 42 ఏళ్ల మహిళ ఆమె.
టిబెట్ బోర్డర్‌లోని మాలోగామ్ దగ్గర ఒక్క ఓటర్ ఉన్నారని తెలిసి ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ అక్కడ ఏర్పాటు చేయాలా వద్దా అని ఆలోచించి చివరకు అక్కడే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీంతో ఏప్రిల్ 11న మొదటిదశలో జరిగిన పోలింగ్ కోసం తన టీమ్‌ని రెండు రోజుల ముందే అక్కడకి పంపించారు. 2 EVM బాక్సులు, ఓ సెక్యూరిటీ గార్డ్, నలుగురు సిబ్బంది, ఓ మీడియా ప్రతినిధి కలిసి అడవుల నుండి ఇరుకు దారుల్లో అవస్థలు పడుతూ బయలుదేరారు.
సొకేలా తయాంగ్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళితే ఎలా ? ఆలోచించారు. ఇంత కష్టపడి వస్తే ప్రయత్నం వృధా అయిపోతుందేమో అని వారిలో అనుమానం సోకింది..అయినా ముందుకు సాగారు. పోలింగ్‌కి ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 11 ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ షెడ్‌లో విఐపి ఓటర్ కోసం వారు ఎదురు చూశారు. ఉదయం 8.30 అవుతుండగా సొకేలా తయాంగ్ వచ్చి తన హక్కు వినియోగించకుంది.
తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఆమెని పట్టణంలోని ఆస్పత్రిలో ఉంచడానికి మాలోగామ్ విడిచిపెట్టినట్లు చెప్పిందామె. ఓటు వేయడానికే ఆమె అక్కడ్నుంచి 125 మైళ్లు ప్రయాణించి వచ్చినట్లు చెప్పి తన కోసం సిబ్బంది పడిన కష్టానికి కృతజ్ఞతలు తెలిపిందట. ఒక్క ఓటర్ అయినా నిబంధనలు పాటించాల్సి కదా.. సాయంత్రం 5 గంటల వరకు నిబంధనల ప్రకారం బూత్ ఓపెన్ చేసే ఉంచారు. తర్వాత తాము తెచ్చిన 67 ఐటెమ్స్ లిస్ట్ చెక్ చేసుకున్నారు. అనంతరం వందల కిలో మీటర్లు ప్రయాణించారు. ఒక్క ఓటర్ కోసం ప్రయాణం చేయడమనేది భారత ప్రజాస్వామ్యంలోని బ్యూటీగా చెప్పుకోవాలి.