Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మహారాష్ట్ర నూతన  ముఖ్యమంత్రిగా బీజేపీ నేతను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్లు బీజేపీ పెద్దలకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Eknath Shinde

Updated On : December 3, 2024 / 2:14 PM IST

Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే విశ్రాంతి తీసుకొనేందుకు ఆయన ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు తదితర విషయాలపై బీజేపీ పెద్దలతో చర్చలు జరిపేందుకు ఆయన సోమవారం ముంబయికి చేరుకున్నారు. అయితే, తాజాగా షిండే ఆరోగ్యం క్షీణించడంతో ఠానేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థత కారణంగా షిండే నీరసంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

Also Read: మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు సంచలన ట్వీట్

మహారాష్ట్ర నూతన  ముఖ్యమంత్రిగా బీజేపీ నేతను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్లు బీజేపీ పెద్దలకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, ఈనెల 5వ తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు, శాఖల కేటాయింపుపై కూటమి నేతల మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. ఈనెల 5న సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

 

డిసెంబర్ 4న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మరోవైపు.. నూతన సీఎం అభ్యర్థి ఎంపికకోసం బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ సీఎం విజయ్ రూపానీలను బీజేపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. వారు ఇవాళ సాయంత్రం ముంబై చేరుకొని మహా కూటమి నేతలతో సమావేశంకానున్నారు. మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ లు సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశంలో నూతన ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రి వర్గం ఫార్ములాపై కూటమి నేతలు ఏకాభిప్రాయంకు రానున్నారు. అయితే, ఏక్‌నాథ్ షిండే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.