మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు సంచలన ట్వీట్

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేతనే ఎంపిక చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో ..

మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు సంచలన ట్వీట్

Maharashtra New CM

Updated On : December 2, 2024 / 2:28 PM IST

Maharashtra New CM 2024: మహారాష్ట్ర సీఎం ఎంపికపై సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేతనే ఎంపిక చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆపధ్దర్మ సీఎం, శివసేన నేత ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ నేత అదిరోహించబోతున్నాడని, షిండేకు ఉపముఖ్యమంత్రి పదవి, కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేతనే ఎంపిక చేస్తే.. వారిలో దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు. అతనికే అవకాశం దక్కుతుందా.. మరో బీజేపీ నేతను ఎంపిక చేస్తారా అనే విషయంపైనా ఉత్కంఠ నెలకొంది.

 

ఇదిలాఉంటే.. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ ముంబయిలో జరుగుతుందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఈనెల 4వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేశారు. 4వ తేదీన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నానికి ముంబై రావాలని తమ ఎమ్మెల్యేలందరికీ బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం మహాయుతి నేతలు గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అయితే, డిసెంబర్ 5న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు పేర్కొంటున్నప్పటికీ.. 5న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారా మరో తేదీన నిర్ణయిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

 

షిండే కుమారుడు కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్రలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో తాను డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు. మహాయుతి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయంటూ శ్రీకాంత్ షిండే ‘ఎక్స్’లో పోస్టు చేశాడు.

శ్రీకాంత్ షిండే ట్వీట్ లో ఏం చెప్పారంటే.. ‘‘మహాకూటమి ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం కాస్త ఆలస్యమైందని, ప్రస్తుతం దీనిపై సర్వత్రా చర్చలు, పుకార్లు జరుగుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్య కారణాలతో రెండు రోజులు స్వగ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రిని నేనే అనే వార్తలు గత రెండు రోజులుగా క్వశ్చన్ మార్కులతో మీడియాలో వస్తున్నాయి. నిజానికి అందులో ఎలాంటి నిజం లేదు. ఉపముఖ్యమంత్రిగా నా పదవిపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా నాకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ, పార్టీ బలోపేతంకోసం పని చేయాలని భావించి, అప్పుడు కూడా మంత్రి పదవిని నిరాకరించాను. అధికారంలో ఉండాలనే కోరిక నాకు లేదు. రాష్ట్రంలో మంత్రి పదవి రేసులో నేను లేనని మరోసారి స్పష్టం చేస్తున్నాను. నా లోక్‌సభ నియోజకవర్గానికి, శివసేనకు మాత్రమే నేను పనిచేస్తాను.’’ అంటూ శ్రీకాంత్ షిండే పేర్కొన్నారు.