Elections Results 2024 : రాహుల్ గాంధీ చేతిలో ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి.. రాయ్‌బరేలి ప్రజలకు క్షమాపణలు..!
Elections Results 2024 : తాజా ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ 3,60,914 ఓట్లతో ముందంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ 1,59,870 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

Elections Results 2024 _ BJP's Raebareli candidate Dinesh Pratap Singh ( Image Credit : Google )
Elections Results 2024 : ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ రాయ్‌బరేలీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ మంగళవారం (జూన్ 4) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతిలో ఓటమిని అంగీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పెట్టారు. రాయ్‌బరేలీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలిలో విజయం సాధించేందుకు తమ పార్టీ సభ్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నప్పటికీ.. ‘నిర్ణయం మా చేతుల్లో లేదు’ అని సింగ్ పేర్కొన్నారు.
Read Also : ఏపీ సీఎంగా 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పవన్ తో భేటీ ఎప్పుడంటే?
తాజా ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాహుల్ గాంధీ 3,60,914 ఓట్లతో ముందంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ 1,59,870 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో దినేష్ ప్రతాప్ సింగ్.. “నేను ఎంతో వినయంతో కష్టపడి రాయ్‌బరేలీ ప్రజలకు సేవ చేసాను. ప్రజాసేవలో నా ఆలోచనలు, మాటలలో లేదా చేతలలో ఏదైనా పొరపాటు చేసి ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టినట్లయితే నన్ను క్షమించండి’’ అంటూ తన ఓటమిని ముందుగానే అంగీకరించారు. వాస్తవానికి ఇంకా ఈ నియోజకవర్గంలో పూర్తి ఫలితం రాలేదు.
అదేవిధంగా, పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసి ఎన్నికల్లో పోరాడిన శ్రేయోభిలాషులు, పార్టీ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కానీ, నిర్ణయం మా చేతుల్లో లేదన్నారు. ప్రజాకోర్టులో వారు ఏ ఆదేశాన్ని ఇచ్చినా ఎల్లప్పుడూ గౌరవంగా స్వీకరిస్తానని అన్నారాయన. ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా రాయ్‌బరేలీ నియోజకవర్గానికి నిరంతరం మద్దతు ఇస్తానని అక్కడి ప్రజలకు బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా మే 20న రాయ్‌బరేలీ ఎన్నికలు జరిగాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి సాంప్రదాయంగా ఈ నియోజకవర్గం మారింది. గతంలో సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీలకు కూడా ఇదే నియోజకవర్గంలో సీటు దక్కింది.
Read Also : Stock Markets Today : భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి!