కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం

రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది యూరోపియన్ యూనియన్ కు చెందిన రాయబారులు కూడా ఉన్నారు. కశ్మీర్ కు ప్రత్యేక కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఈ బృందం కశ్మీర్ లో పర్యటిస్తోంది.
ఇవాళ ఉదయం ఈ బృందం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో బోటులో విహరించింది. అనంతరం స్థానిక మీడియతో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయనాయకులు,ఎంటర్ ప్రెన్యూయర్స్ తో ఈ బృందం లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ విదేశీ రాయబారుల బృందంని కలిసినవారిలో పీడీపీ లీడర్ జహంగీర్,కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉస్మాన్ మజీద్ లు కూడా ఉన్నారు. ఆర్మీ అధికారులు ఈ బృందంకు కొన్ని వాస్తవ సరిస్థితుల గురించి వివరించారు. కొంతమంది స్థానికులు(ఇందులో ప్రభుత్వం యొక్క స్కిల్డ్ సొసైటీ ప్రోగ్రాం కింద ట్రైన్ అవుతున్న యువకులు కూడా ఉన్నారు)తో ఈ బృందం సమావేశమైంది. ఈ బృందం గురువారం జమ్మూలో పర్యటించనుంది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము,సివిల్ అడ్మినిస్ట్రేషన్ తో ఈ బృందం సమావేశం కానుంది. ఆగస్టులో ఆర్టికల్ 370ర్దదు తర్వాత కేంద్రప్రభుత్వ అనుమతితో కశ్మీర్ ను సందర్శించిన విదేశీ రాయబారుల రెండవ బృందం ఇది.
అయితే ఆర్టికల్ 370రద్దు సమయంలో కశ్మీర్ లో విధించిన అనేక ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు అధికారులు. అయితే మొబైల్ ఇంటర్నెట్ వంటివి ఇంకా నిషేధాజ్ణలలోనే ఉన్నాయి. 370రద్దు సమయంలో అదుపులోకి తీసుకున్న అనేకమంది రాజకీయనాయకులు,ప్రముఖులను దాదాపు 99శాతం మందిని విడుదల చేశారు పోలీసులు. అయితే మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మొహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రధాన రాజకీయ నాయకులు మాత్రం ఇంకా పోలీసుల నిర్భందంలోనే ఉన్నారు. గత వారం ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నచోటే ఉంచనున్నారు.
గతేడాది అక్టోబర్ లో యూరోపియన్ యూనియన్ నుండి చట్టసభ సభ్యుల బృందం వారి ప్రైవేట్ సామర్థ్యంతో కాశ్మీర్ లోయను సందర్శించింది. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం..విదేశీ రాయబారుల బృందం కశ్మీర్ ను సందర్శించడానికి వీలు కల్పించింది. అయితే యూరోపియన్ యూనియన్ దానిని దాటవేసింది. వేరొక రోజు వారు కశ్మీర్ కు వెళతారని చెప్పారు. చట్టసభ సభ్యులు “గైడెడ్ టూర్” పట్ల ఆసక్తి చూపడం లేదని అప్పట్లో వారి నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి మరింత సాధారణం కావడంతో ఇలాంటి సందర్శనలు ఎక్కువగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది