1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రతన్ టాటా రాసిన లేఖ ఇప్పుడు వైరల్.. ఎందుకంటే?

ఎంతో ధైర్యంతో, దూరదృష్టితో దేశ కొత్త చరిత్రను లిఖించినందుకు ప్రతి భారతీయుడు పీవీ నరసింహారావుకు రుణపడి ఉండాలని ఆ లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు.

1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రతన్ టాటా రాసిన లేఖ ఇప్పుడు వైరల్.. ఎందుకంటే?

Updated On : October 16, 2024 / 2:41 PM IST

దివంగత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఈ లేఖను ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆ లేఖను రతన్ టాటా సొంత దస్తూరితో రాశారు. దేశానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడంలో పీవీ నరసింహారావు సాధించిన అత్యుత్తమ విజయాల పట్ల టాటా తన గౌరవాన్ని ఈ లేఖ ద్వారా తెలిపారు. 1996లో దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చిన పీవీ నరసింహారావుని ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే.

ఎంతో ధైర్యంతో, దూరదృష్టితో దేశ కొత్త చరిత్రను లిఖించినందుకు ప్రతి భారతీయుడు పీవీ నరసింహారావుకు రుణపడి ఉండాలని ఆ లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. దేశానికి అవసరమైన ఎన్నో ఆర్థిక సంస్కరణలను తీసుకురావడంలో పీవీ నరసింహారావు సాధించిన అత్యుత్తమ విజయాన్ని తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, ఈ విషయాన్ని చెప్పడానికి ఈ లేఖను రాస్తున్నానని అన్నారు.

పీవీ నరసింహారావు, ఆయన ప్రభుత్వం ఆర్థిక కోణంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారని చెప్పారు. భారతీయులను ప్రపంచ సమాజంలో భాగం చేశారని అన్నారు. పీవీ నరసింహారావు విజయాలు ఎంతో అత్యద్భుతమైనవి తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని, వాటిని ఎప్పటికీ మరచిపోకూడదని చెప్పారు. ఓ గొప్ప మనిషి మరో గొప్ప మనిషికి రాసిన లేఖ అంటూ దీన్ని హర్ష గోయెంకా పోస్ట్ చేశారు.

Nayab Singh Saini: హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ రేపు ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబుసహా హాజరుకానున్న ప్రముఖులు