26 ఏళ్ల సీఏ మృతిపై హెచ్‌సీఎల్‌ మాజీ సీఈవో స్పందన.. ఆఫీసుల్లో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి గురించి కామెంట్స్

అధిక పని గంటల వల్ల స్ట్రోక్ ముప్పు 35 శాతం, గుండె జబ్బుల ప్రమాదం 17 శాతం పెరుగుతుందని..

26 ఏళ్ల సీఏ మృతిపై హెచ్‌సీఎల్‌ మాజీ సీఈవో స్పందన.. ఆఫీసుల్లో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి గురించి కామెంట్స్

Former HCL CEO Vineet Nayar

Updated On : September 19, 2024 / 6:14 PM IST

Former HCL CEO Vineet: అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) అనే యువతి అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ పుణెలోని ఈవై కంపెనీలో నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది.

పెరాయిల్ తల్లి అనితా అగస్టిన్ ఆ కంపెనీ భారత సీఈఓ రాజీవ్ మెమానికి ఈ-మెయిల్ పంపి, తన కూతురు కంపెనీలో పని ఒత్తిడి వల్లే చనిపోయిందని చెప్పింది. దీంతో దేశంలో కొత్త ఉద్యోగులపై పని ఒత్తిడి అధికంగా ఉంటోందని, వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ దీనిపై లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ చేశారు. పూణేలో ఆ యువతి మృతి చెందిన తీరు వ్యవస్థాగత సమస్యను ఎత్తిచూపిందని అన్నారు. కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన యువత నుంచి చేస్తున్న శ్రమ దోపిడీ సమస్యను పారిశ్రామికవేత్తలు వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఉద్యోగంలో చేరిన యువతకు శిక్షణ పేరుతో లేదా పోటీ ప్రపంచానికి వారిని సన్నద్ధం చేయడం అనే ముసుగులో వారితో అధికంగా పని చేయిస్తున్నారని ఆయన అన్నారు.

కష్టపడి పనిచేయడం అవసరమైనప్పటికీ, అధిక గంటలు పనిచేయడం ప్రామాణికం కాకూడదని చెప్పారు. అధిక పని గంటల వల్ల స్ట్రోక్ ముప్పు 35 శాతం, గుండె జబ్బుల ప్రమాదం 17 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పిందని తెలిపారు. అధిక పని గంటల పద్ధతి వల్ల యువ ఉద్యోగులు వారాలకొద్దీ, నెలలకొద్దీ విరామం లేకుండా పనిచేస్తున్నారని అన్నారు.

ఇది విష సంస్కృతిని పెంపొందిండచమేనని, అలసటను అనుభవిస్తూ, శ్రేయస్సును విస్మరిస్తున్నారని చెప్పారు. సంస్థలో ఎలాంటి సంస్కృతి ఉండాలన్న విషయానికి హెచ్‌ఆర్‌ కీలకమని చెప్పారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధన ప్రకారం 75 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల్లో అధికస్థాయుల్లో ఒత్తిడిని అనుభవిస్తున్నారని అన్నారు.

జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూ.. ఆధారాలు ఇవిగో..: ఆనం వెంకట రమణారెడ్డి