Dowry Tortoise, Dog : కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు
వరకట్నంగా ఎవరైనా డబ్బు, పొలం, బంగ్లా, బంగారం, ఖరీదైన కార్లు అడుగుతారు. అందులో వింతేమీ లేదు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ కుటుంబం వెరైటీ వరకట్నం అడిగి అడ్డంగా బుక్కైంది. జైలు పాలైంది.

Dowry Tortoise, Dog
tortoise with 21 toenails black Labrador dog dowry : భారత్‌లో వరకట్నం తీసుకోవడం నేరం. తీసుకోవటమే కాదు అడగటం, ఇవ్వటం, ప్రకటనలు చేయటమూ నేరమే. అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. నేరం అని తెలిసినా ఇప్పటికీ 95 శాతం వివాహాల్లో కట్నకానుకలు, చెల్లింపులు జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వరకట్నం తీసుకోవడాన్ని సామాజిక రుగ్మతగా చెప్పినప్పటికీ ఈ ఆచారం చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. కొందరు మహిళలు గృహ హింస, వరకట్నం చావులకు బలవుతున్నారు.
ఇకపోతే వరకట్నంగా ఎవరైనా డబ్బు, పొలం, బంగ్లా, బంగారం, ఖరీదైన కార్లు అడుగుతారు. అందులో వింతేమీ లేదు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ కుటుంబం వెరైటీ వరకట్నం అడిగి అడ్డంగా బుక్కైంది. జైలు పాలైంది.
ఔరంగాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడికి రూ.2 లక్షల నగదు, తులం బంగారం కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా సవ్యంగా సాగిపోతోంది అని అనుకుంటున్న తరుణంలో వరుడు తన వింత కోరికల చిట్టాను బయటపెట్టాడు. కట్నంగా తనకు రూ. 10లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు 21 గోళ్లున్న తాబేలు, ఓ నల్ల లాబ్రడార్ జాతి కుక్క, బుద్ధుడి బొమ్మ, దీపం కుందెలు కూడా కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇవి ఇస్తేనే పెళ్లయ్యాక మీ కూతురికి జాబ్ వస్తుందని నమ్మించాడు.
వరుడి వింత కోరికలు విని వధువు తరఫు వారు షాకయ్యారు. వారికి దిమ్మతిరిగిపోయింది. ఇటువంటి వింత కోరికలు వద్దంటూ వరుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇవి తమ శక్తికి మించిన డిమాండ్లంటూ వాపోయారు. కానీ.. వరుడు తన మనసు మార్చుకోకపోగా.. పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు మరోదారి లేక పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు వరుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.