ఫోని ఎఫెక్ట్ : బీచ్ ల నుండి వెళ్లిపోవాలంటు బెంగాల్ సర్కార్ ఆదేశాలు 

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 04:17 AM IST
ఫోని ఎఫెక్ట్ : బీచ్ ల నుండి వెళ్లిపోవాలంటు బెంగాల్ సర్కార్ ఆదేశాలు 

Updated On : May 3, 2019 / 4:17 AM IST

కోల్‌కతా : ‘ఫోని’ తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమయ్యాయి.  ఈ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. 

ఈ క్రమంలో బెంగాల్ లోని సముద్ర తీరంలోని మిడ్నాపూర్, సౌత్ 24 ప్రాంగణాస్ జిల్లాల్లోని పర్యాటకులు ఆ ప్రాంతాలను వదిలి  సురక్షితప్రాంతాలకు వెళ్లాలని పశ్చిమబెంగాల్ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా తీరాన్ని తాకుతున్న ఫోని తుఫాను ప్రభావం  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్, సౌత్ 24 ప్రాంగణాస్, హౌరా, హుగ్లీ, ఝార్రాం, సుందర్ బన్స్, కోల్‌కతాలపై ఉండవచ్చని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దిఘా, శంకర్ పూర్, తాజ్ పూర్, మందర్ మణి, బాక్కాలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దీంతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూంను ప్రారంభించి సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం మమతాబెనర్జీ అధికారులను ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ మలయ్ కుమార్  నేతృత్వంలో మమతా తుఫాన్ సహాయ పునరావాస పనులు చేపట్టేందుకు అధికారులతో కమిటీని  నియమించారు.