భారత్ లోనే ఉంటాం..సాయం చేయండి : మయన్మార్ పోలీస్ శరణార్థులు
మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనలను ఆ దేశ సైన్యం తీవ్రంగా అణచి వేస్తోంది.

Fleeing Coup Myanmar Police Refugees In India Seek Asylum1
Myanmar police refugees మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనలను ఆ దేశ సైన్యం తీవ్రంగా అణచి వేస్తోంది. ఇప్పటి వరకు 200 మంది పౌరులు భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. గాయపడినవారు, జైళ్ళకు పోయినవారు వేలల్లో ఉన్నారని అంచనా. సైన్యం నిరంకుశ చర్యల వల్ల చాలామంది మయన్మార్ ప్రజలు,పోలీస్ అధికారులు సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.
అయితే,ఇటీవల మయన్మార్ సైన్యం ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు పోలీసు అధికారులు సరిహద్దులు దాటి శరణార్థులుగా భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మిజోరంలో ఆశ్రయం పొందుతున్న ఆ పోలీసు అధికారులు..తమకు మానవతా దృక్పథంతో భారత్లోనే ఆశ్రయం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. మయన్మార్‌లో సైన్యం సాధారణ పౌరులపై చేస్తున్న అరాచకాలను ఆ ఇద్దరు పోలీస్ అధికారులు ఒక్కొక్కటిగా వివరించారు.
మయన్మార్ సైనిక పాలనలో కనీసం నిద్ర పోయే సమయం కూడా మాకు లేదు. ఎప్పుడూ ఏ ఆదేశాలు సైన్యం ఇస్తుందో అని కలవరపడే వాళ్లం. ఆందోళనలు జరిగినప్పుడల్లా మమ్మల్ని ముందు వైపునకు పంపించి సైన్యం వెనుక ఉండేది. ఆందోళనకారులను అరెస్టు చేసి హింసించాలని సైన్యం మమ్మల్ని ఆదేశించేది. పౌరులను హింసించడం ఇష్టంలేని మాకు దేశం విడిచి రావడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అమాయక ప్రజలను హింసించడం ఇష్టం లేకే కుటుంబంతో సహా దేశం వదిలి వచ్చినట్లు ఇద్దరు మయన్మార్ పోలీస్ అధికారులు వివరించారు. ప్రస్తుతం మిజోరంలోని ఓ గ్రామంలో తాము కుటుంబాలతో కలిసి క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. స్థానికులు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. దేశాన్ని వదిలి రావడం బాధగా ఉన్నా తప్పలేదని వాపోయారు. మోడీ ప్రభుత్వం తమకు తిరగి వెనక్కి పంపకుండా మానవతా దృక్పథంతో భారత్ లోనే ఆశ్రయం కల్పించాలని వారు కోరారు.
భారత్‌తో 16 వందల 43 కిలోమీటర్ల సరిహద్దును మయన్మార్ పంచుకుంటోంది. మయన్మార్ లో సైన్యం నిరంకుశ చర్యల వల్ల చాలామంది మయన్మార్ ప్రజలు సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇంతవరకు ఎంత మంది శరణార్థులు మిజోరం వచ్చారో తెలియనప్పటికీ వారి సంఖ్య వందల సంఖ్యలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులను మిజోరం ప్రభుత్వం అనుమతించింది. అయితే మానవతా కారణాలతో తప్ప మయన్మార్ నుంచి ఎవర్నీ భారత్‌లోకి అనుమతించవద్దని ఆ దేశంతో సరిహద్దులు కలిగిన మిజోరం సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు కిలోమీటర్ల మేర ఉండటంతో మయన్మార్ శరణార్థులను భారత్‌లోకి రాకుండా అడ్డుకోవడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, మయన్మార్ రాజకీయ సంక్షోభం.. మన దేశంలో ఇడ్లీ, దోశ, వడకు సెగ పెడుతోంది. మనం దిగుమతి చేసుకునే మినుముల్లో 84 % అక్కడి నుంచే వస్తాయి. దిగుమతి చేసుకున్న దాంట్లో దక్షిణాదికే 78% దాకా వస్తాయి. అక్కడి నుంచి మినుముల దిగుమతి తగ్గిపోవడంతో రేట్లపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, లక్నో వంటి సిటీల్లో మినుముల రేట్లు పెరిగాయి. మనం మయన్మార్ తో పాటు ఈస్ట్ ఆఫ్రికా నుంచి మినుములను ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. కానీ, ప్రస్తుతం అక్కడి నుంచి అనుకున్న స్థాయిలో అవి సరఫరా కావట్లేదు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి మయన్మార్‌లో బ్యాంకులన్నీ మూతపడ్డాయి. కస్టమ్స్ వాళ్లు కూడా డ్యూటీ చేయట్లేదు. చాలా దేశాలు అక్కడికి కంటెయినర్లను పంపించట్లేదు. మయన్మార్ నుంచి కూడా కంటెయినర్లు వెళ్లట్లేదు. దీంతో భవిష్యత్లో మినుముల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఈ ఏడాది దిగుమతులు రావడం అంత సులభమేమీ కాదు.