లిక్కర్ స్కాం కేసు.. మాజీ సీఎం కొడుకు అరెస్ట్.. పుట్టిన రోజునాడే బేడీలు..

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు, వ్యాపారవేత్త చైతన్య బఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు.

లిక్కర్ స్కాం కేసు.. మాజీ సీఎం కొడుకు అరెస్ట్.. పుట్టిన రోజునాడే బేడీలు..

Chaitnya Baghel

Updated On : July 18, 2025 / 2:23 PM IST

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు, వ్యాపారవేత్త చైతన్య బఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల భూపేశ్ బఘేల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం, చైతన్యను అరెస్టు చేశారు.

2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఈడీ ఆరోపించింది. చైతన్య భాఘేల్, అతని సన్నిహితులు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా నిధులలో కొంత భాగాన్ని లాండరింగ్ చేశారని ఈడీ ఆరోపించింది. దీంతో, రాష్ట్ర ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది.

కుమారుడు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రతిపక్ష గొంతులను అణచివేసే ప్రయత్నం అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని, ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసమ్మతిని అణిచివేసేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను, డీఆర్ఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని భూపేశ్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ చైతన్య బఘేల్ పుట్టిన రోజు. బర్త్ డేరోజునే ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. చైతన్య బఘేల్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈడీ అధికారులను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.