Aziz Qureshi : యోగి సర్కార్ పై విమర్శలు..మాజీ గవర్నర్ పై దేశద్రోహం కేసు
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై దేశద్రోహం కేసు నమోదైంది.

Up
Aziz Qureshi యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్త ఆకాష్ సక్సేనా చేసిన ఫిర్యాదుతో అజీజ్ ఖురేషీ పై రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఏమన్నారు?
ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ శనివారం(4-9-2021)సమాజ్ వాది పార్టీ ఎంపీ అజామ్ ఖాన్ భార్య తంజీమ్ ఫాతిమాను కలిసేందుకు రామ్‌పుర్ లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో యోగి ఆదిత్యానాథ్ సర్కారును రక్తం తాగే పిశాచి ప్రభుత్వం అంటూ ఖురేషీ వ్యాఖ్యానించారని బీజేపీ కార్యకర్త ఆకాష్ సక్సేనా రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. సక్సేనా తన ఫిర్యాదులో ఖురేషీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుందని, మతపరమైన అల్లర్లకు కూడా దారితీస్తుంది అని పేర్కొన్నారు.
దీంతో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై పోలీసులు ఆదివారం రాత్రి పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఖురేషీపై ఐపీసీ సెక్షన్ 124ఏ, 153ఏ, 153బీ, 505(1)(బీ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ముందస్తు ప్రణాళిక అని అజీజ్ గతంలో ఆరోపించారు.