పంజాబ్ తొలి మహిళా రచయిత్రి అమృతా ప్రీతంకు గూగుల్ డూడుల్ నివాళి

అమృతా ప్రీతం.పంజాబ్ తొలి ప్రముఖ మహిళా రచయిత్రి.పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించిన మొదటి మహిళ. ఆమె రచనలకు జాతీయ..అంతర్జాతీయ అవార్డులు వరించాయి. పద్మశ్రీ.. పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. స్త్రీవాద ఉద్యమం చురుకుగా పనిచేసిస అమృతా ప్రీతం తన సాహిత్యంతో మహిళా గళాన్ని వినిపించారు. కవయిత్రిగా, నవలా రచయిత్రిగా పలు ప్రతిష్టాత్మక రచనలు చేసిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి అమృతా ప్రీతంకు 100వ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ నివాళి అర్పించింది.
1919 ఆగస్ట్ 31నలో ఆనాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) అమృత కౌర్ జన్మించారు.తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ సింగ్ హిత్కారి స్కూల్ టీచర్,పత్రికా సంపాదకుడుగా కూడా పనిచేశారు. అమృత 11 యేటనే తల్లి చనిపోయింది. దీంతో ఆమెను తీసుకుని తండ్రి లాహోర్ చేరుకున్నారు. 1947లో జరిగిన దేశ విభజన వరకూ వారు లాహోర్ లోనే ఉన్నారు. అమృత 16వ ఏట ‘’అమృత్ లేహ్రాన్ ‘’(అమృత తరంగాలు )కవిత రాశారు. అదే వయస్సులో ప్రీతం సింగ్ అనే సంపాదకుని వివాహం చేసుకొని అమృతా కౌర్ అమృతా ప్రీతంగా మారారు. 1936-43 మధ్యలో అమృత ఆరు కవితా సంపుటాలు రచించి వెలువరించారు.
అమృత ప్రీతం మొదట రొమాంటిక్ కవితలతో ప్రారంభించి..తరువాత అభ్యుదయవాద కవిత్వం రాయటం ప్రారంభించారు. 1943లో వచ్చిన ఘోరమైన బెంగాల్ కరువుకు స్పందించిన అమృత 1944లో ‘’లోక్ పీడ్’’ (ప్రజా వేదన )కవిత సంపుటిలో అభ్యుదయవాదం స్పష్టంగా కనిపిస్తుంది. దేశ విభజన అనంతరం అమృత దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. సాంఘిక సేవాకార్యక్రమాలలోనూ పాల్గొని గురు రాధ కృష్ణ నెలకొల్పి,బాలరాజ్ సహానీ ,అరుణా ఆసఫాలీ లు ఆవిష్కరించిన మొట్టమొదటి జనతా గ్రంథాలయం కార్యక్రమంలో అమృత చురుకైన పాత్ర పోషించారు. అది ఈనాటికి ఈ లైబ్రరీ క్లాక్ టవర్ సెంటర్ లో ప్రజలకు అందుబాటులో ఉంది.
1947లో జరిగిన దేశ విభజన అనంతరం 1948లో అమృత లాహోర్ వదలి ఢిల్లీకి ఆ తరువాత పంజాబ్ కు చేరుకున్నారు. అప్పటికి ఆమెకు 28 ఏళ్లు. గర్భవతిగా ఉన్నారు అమృతా ప్రీతం, కొడుకుతో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి చేరింది. తన ప్రయాణ బాధలను, వేలాది శరణార్థుల కష్టాలను కళ్ళకు కట్టినట్లు ‘అజ్జ్ అఖాన్ వారిస్ షాహ్ ను ‘’(వారిష్ షా ను ఇవాళ అడుగుతున్నా ) అనే కవిత రాసారు. .ఈ కవితను 16 వ శతాబ్దపు ప్రముఖ పంజాబీ సూఫీ కవి,’’హీర్ అండ్ రంజా ‘’ అనే విషాద కావ్య నిర్మాత ,లాహోర్ లో తన ఆరాధ్య కవి అయిన వారిష్ షా ను ఉద్దేశించి స్మారక కవిత గా (ఎలిజీ) గా రాసింది.
1961వరకు ఢిల్లీ ఆకాశ వాణిలో పని చేసిన అమృత 1960 లో భర్తతో విడాకులు తీసుకొన్నతర్వాత స్త్రీవాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కవితలలో కధలలో తన విఫల దాంపత్య జీవితాన్నే ప్రస్పుటించారు. పంజాబీ ,ఉర్దు భాషలలొ రాసిన ఆమె రచనలన్నీ ఇంగ్లీష్, ఫ్రెంచ్, డేనిష్ ,జపనీస్,మండారిన్ లతో పాటు పలు భాషలలోకి అనువాదం పొంది విశ్వ వ్యాప్తమై ఘన కీర్తి పొందాయి.
ఆమె స్వీయ చరిత్ర ‘’బ్లాక్ రోజ్,‘రసీదీ టికెట్ (రెవెన్యూ స్టాంప్ )రచనలు కూడా అనువదింపబడి ఆమె ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా పేరు పొందారు. ఆమె నవల ‘’ధర్తి సాగర్ తే సిప్పియాన్ ‘’కాదంబరి’ సినిమాగా 1965లో మొదటగా తెర కెక్కించారు. తర్వాత ‘’ఉనాహ్ కి కహానీ ‘’ని ప్రముఖ దర్శకుడు బాసు భట్టాచార్య ‘’డాకూ’’ (బందిపోటు)గా తీశారు. ఆమె రాసిన ‘’పింజర్ ‘’(ఆస్తి పంజరం )నవలలో పార్టిషన్ సమయంలో ఇండియా ,పాకిస్తాన్ లలో జరిగిన ఘోరాలు అవమానాలు దౌర్జన్యాలు,స్త్రీలు పడిన అంతులేని బాధలు కళ్లకుకట్టారు.
ఇందులో ‘’ప్యూరో ‘’అనే పాత్ర స్త్రీలపై చేసిన దుష్కృత్యాలకు ,,హింసకు ప్రతినిధి గా మలచింది .దీన్ని చంద్ర ప్రకాష్ ద్వివేది చలన చిత్రంగా అద్భుతంగా తీయగా అందులోని మానవత్వ విలువలకు ఈ సినిమా అవార్డ్ పొందింది .రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలైన రాజస్థాన్ ,పంజాబ్ లలో దీన్ని చిత్రించారు .ఆమె ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలలోనూ అభిమాన రచయిత్రిగా గౌరవం పొందింది .పాకిస్తాన్ లో తన సమకాలీన రచయితలైన మోహన్ సింగ్, శివకుమార్ బటాల్డి లతో సమమైన కీర్తి, గౌరవాలు అందుకొన్నది .ఆమె కూడా అలాగే రెండు దేశాలమీద అభిమానం చూపింది.
‘’నాగమణి ‘’అనే పంజాబీ మాసపత్రిక సంపాదకురాలుగా అమృతా ప్రీతం 33 యేళ్లపాటు పని చేశారు. ఇండియా వచ్చాక హిందీలో కూడా రచనలు చేశారు. ఆమె చేసిన రచనలకు పలు పురస్కారాలు అందుకున్నారు. ‘పంజాబ్ రత్తన్ అవార్డ్ ‘ ను అప్పటి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. పంజాబ్ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి అమృతా ప్రీతం.
1956లో’’సునేహాదే ‘’(సందేశాలు )రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని మొట్టమొదటి మహిళా రచియిత్రిగా చరిత్ర సృష్టించారు. ’’కాగజ్ తే కాన్వాస్ ‘’రచనకు భారతీయ జ్ణానపీఠ్ అవార్డ్ కూడా ఆమెను వరించి కీర్తిని మరింత ఇనుమడింపజేసింది .భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ ,తర్వాత పద్మ విభూషణ్ పురస్కారాలు అందించి గౌరవించింది .2004లో సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ,ఢిల్లీ యూని వర్శిటీ,విశ్వభారతి ,జైపూర్ యూని వర్శిటీ ల నుండి గౌరవ డి.లిట్.అందుకొన్న మహిళా మణి అమృతా ప్రీతం.
అమృతా ప్రీతం రచించిన కవితలను ప్రసిద్ధ హిందీ సినీ పాటల రచయిత గుల్జార్ తన గొంతుతో అద్భుతంగా గానం చేసి రికార్డ్ చేసి 2007 లో విడుదల చేశాడు. 60 ఏళ్ళ పాటు ఆమె రచయిత్రిగా రాణించారు.
1982లో భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం, 1969లో పద్మశ్రీ పురస్కారం, 2004లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, పద్మవిభూషణ్ పురస్కారం లభించాయి. డిల్లీ విశ్వవిద్యాలయం(1973), జబల్‌పూర్ విశ్వవిద్యాలయం (1973), విశ్వభారతి (1987) లతో పాటు అనేక విశ్వవిద్యాలయాలనుండి ఆమెకు డి.లిట్, గౌరవ డిగ్రీలు లభించాయి.
పలు అంతర్జాతీయ అవార్డ్ లు కూడా ఆమెను వరించాయి. బల్గేరియా ప్రభుత్వం ‘’వాప్సరోవ్ ‘’అవార్డ్ ను 19 79 లో, 19 87 లో ఫ్రెంచ్ ప్రభుత్వం ‘’డిగ్రీ ఆఫ్ ఆఫీసర్స్ డెన్స్ ‘’అవార్డ్ ,అందజేశాయి. భారతప్రభుత్వం ఆమెను రాజ్య సభకు నామినేట్ చేయగా 1986 నుండి 92 వరకు ప్రజా సేవలో ఉన్నారు. జీవిత చరమాంక౦లో ఆమెకు పాకిస్తాన్ లోని పంజాబ్ అకాడెమీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.
దీనిపై అమృతా స్పందిస్తూ ఆమె ‘’నా మాతృదేశం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు నన్ను గుర్తించింది’అంటూ భావోద్వేగానికి గురయ్యారు.పాకిస్తాన్ సిక్కు సమాజం ఆమెకు ప్రముఖ సూఫీ కవి వారిస్ షా, బుల్లే షా, సుల్తాన్ బాహూ ల సమాధులపై కప్పే పవిత్ర వస్త్రాలను ఆమెకు పంపించారు. ఇది వారు ఆమెపై చూపిన గౌరవం.
భర్తనుంచి విడిపోయాక అమృతా ప్రీతం ఒంటరితనం బాధ అనుభవించి ,ప్రముఖ కళాకారుడు రచయిత ఇమ్రోజ్ కు దగ్గరై, చివరి నలభైయేళ్లు అతనితో కలిసి జీవించారు. ఇమ్రోజ్ ఆమె రచించిన పలు పుస్తకాలను డిజైనర్ చేసేశారు. ఆమె రచనలను పెయింటింగ్స్ గా కూడా చిత్రించారు ఇమ్రోజ్. వీరిద్దరి ప్రేమ జీవిత చిత్రణ గా’అమృతా ఇమ్రోజ్ ఎ లవ్ స్టోరీ ‘’పుస్తకానికి రూపుదిదద్దింది. 86 యేళ్ళ వయసులో తొలి పంజాబీ రచయిత్రి పద్మ విభూషణ్ శ్రీమతి అమృతా ప్రీతం శాశ్వత కీర్తి గడించి మరణించారు.