Gossip Garage: బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఈసారి మహిళకు అవకాశం? రేసులో ఉన్నది ఎవరెవరు..
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్‌లుగా కొనసాగారు.

Gossip Garage: అతిపెద్ద జాతీయ పార్టీ. పైగా మూడు టర్మ్‌లుగా అధికారంలో కొనసాగుతోన్న పార్టీ. అలాంటి నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ కావాలంటే..ఎన్నో ఈక్వేషన్స్ కుదిరితేనే కానీ అదృష్టం దక్కదు. అయితే ఈసారి పార్టీ నేషనల్ బాస్‌గా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. ఎస్పెషల్‌గా సౌత్ లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నారట. దాంతో అధ్యక్ష రేసులో ముగ్గురు దక్షిణాది మహిళలే ఉన్నారని టాక్. అందులోనూ వారందరూ ఏపీతో సంబంధాలున్న వారే. కమలం పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయ్యేదెవరు.? రేసులో ఉన్న ఆడపడుచులెవరు.?
సౌత్‌లో పార్టీ బలోపేతం కోసం లేడీ బాస్..!
రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక పూర్తి అయింది. ఇక జాతీయ అధ్యక్ష ఎలక్షన్ మాత్రమే మిగిలి ఉంది. బీజేపీ పార్టీ నియమ నిబంధనల ప్రకారం..జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకం తర్వాత నేషనల్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. ఈ క్రమంలో త్వరలోనే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
జేపీ నడ్డా ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉంటూ..పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ధర్మేంద్ర ప్రధాన్‌కు కానీ, భూపేంద్ర యాదవ్‌కు కానీ అవకాశం కల్పిస్తారని టాక్ నడుస్తోంది. ఇదే టైమ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. సౌత్‌లో పార్టీ బలోపేతం, మహిళలకు ప్రాధాన్యత కోసం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్‌గా మహిళా నేతను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో బీజేపీ అధ్యక్ష రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు దక్షిణాదికి చెందిన వారే. ఇందులో ఇద్దరు ఏపీతో సంబంధాలున్న వారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు..మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
రేసులో ముందున్న నిర్మల.. ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతుండటం ప్లస్..
అయితే అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉన్నారంటున్నారు. ఈ మధ్యే ఆమె పార్టీ హెడ్ ఆఫీస్‌లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. తెలుగింటి కోడలు అయిన నిర్మల.. బీజేపీ మహిళా వాయిస్‌గా ఉన్నారు.
11 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, 2019 నుంచి ఆర్థిక శాఖను చూస్తుండటం, నాయకత్వ సామర్థ్యం దృష్ట్యా నిర్మలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఇదే మంచి మార్గమని భావిస్తున్నారట. తమిళనాడుకు చెందిన నిర్మల..వచ్చే ఏడాది జరిగే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించే చాన్స్ ఉందని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతు ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్ అని టాక్.
ఏపీ బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరి బహుభాషావేత్త. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కూతురుగానే గాక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఆమె ఉన్నారు.
మరో మహిళా నేత వనతీ శ్రీనివాసన్ 1993లో బీజేపీలో చేరినప్పటి నుంచి కీలకంగా పనిచేస్తున్నారు. వనతి శ్రీనివాసన్.. తమిళనాడుకు చెందిన న్యాయవాది. కోయంబత్తూర్ దక్షిణ ఎమ్మెల్యే. విశ్వ నటుడు కమల్ హాసన్‌పై గెలిచారు. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2022లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి తమిళ మహిళ ఆమే. పక్కా తమిళ వ్యక్తి అయినందున వనతిని పార్టీ చీఫ్‌గా చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేస్తుందని బీజేపీ ఆలోచించొచ్చు. ఐదేళ్ల కిందటే మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు కావడం.. మూడేళ్ల నుంచి కేంద్ర ఎన్నికల కమిటీలో ఉండటం వనతికి ప్లస్ పాయింట్స్.
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్‌లుగా కొనసాగారు. ఇప్పటివరకు మహిళా నేతకు జాతీయ అధ్యక్ష పగ్గాలు దక్కలేదు. అందుకనే ఈసారి మహిళకు పగ్గాలు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా..దానికి RSS ఆమోదం కీలకం. మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేసేందుకు ఆర్ఎస్ఎస్ ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. పార్టీ అగ్రనేతలు మహిళకే అధ్యక్ష పదవి ఇవ్వాలనుకంటే మాత్రం..ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ పక్కా అని..అందులో నిర్మలా సీతారామన్‌కు అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.