ఫాస్టాగ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

ఫాస్టాగ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Updated On : February 15, 2021 / 8:33 AM IST

government key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చిన కేంద్రం ఇకపై ఫాస్టాగ్ లేకపోతే జరిమానాకు సిద్ధమైంది. ఫాస్టాగ్ లేని వాహనాలకు ఫిబ్రవరి 16 నుంచి టోల్ ప్లాజాల దగ్గర రెట్టింపు ఫీజు వసూలు చేయనున్నారు. సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి రానుంది. ఇక, టోల్ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వారికి ప్రత్యేక కౌంటర్లు ఏమీ ఉండవు.

గడువు పొడిగించేది లేదు:
కాగా, ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువు విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక ఫాస్టాగ్ గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల దగ్గర ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడిగించామన్నారు. మరోవైపు ఫాస్టాగ్‌ ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం(ఫిబ్రవరి 14,2021) ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ అమర్చకపోతే సదరు వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం టోల్ ఫీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

టోల్ ప్లాజాల్లో మొత్తం ఫాస్టాగ్ లేన్లే:
ఇప్పటికే ఫాస్టాగ్ విధానం అమల్లోకి ఉంది. ఫిబ్రవరి 16 నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కాగా, ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనాలకు ఓ లేన్ కేటాయిస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 16 నుంచి ఈ వెసులుబాటు తొలగిస్తున్నామని, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో మొత్తం ఫాస్టాగ్ లేన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా, ఇప్పటికే 80శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. రోజూ 89 కోట్ల రూపాయలను ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 2.54 కోట్ల మందికి పైగా వాహనదారులు ఇప్పటికే ఫాస్టాగ్ ను పొందారు.

మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన రద్దు:
అదే సమయంలో ఫాస్టాగ్ విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా కేంద్రం పరిష్కారం చూపించింది. ఫాస్టాగ్ విషయంలో వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాకుండా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ చార్జి చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనీ, ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, తదుపరి రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది.

ఫాస్టాగ్ ఎలా కొనాలి?
దీనికోసం చాలా ఆప్ష‌న్లే ఉన్నాయి. మీ కారు కోసం ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల ద‌గ్గ‌రే వెళ్లవ‌చ్చు. దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను క‌చ్చితంగా తీసుకెళాల్సి ఉంటుంది. కేవైసీ ప్ర‌క్రియ కోసం ఇవి త‌ప్ప‌నిస‌రి. ఇంకా సులువుగా కొనాల‌నుకుంటే.. అమెజాన్ వెబ్‌సైట్‌కు లేదా ఈ ఫాస్టాగ్ అందించే బ్యాంక్ వెబ్‌సైట్ల‌కు వెళ్లొచ్చు. ప్ర‌స్తుతానికి ఫాస్టాగ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోట‌క్‌, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా మీ ఫోన్‌లోని పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్స్‌ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఫాస్టాగ్‌కు ఎంత ఖ‌ర్చువుతుంది?
ఫాస్టాగ్‌కు ఎంత ఖ‌ర్చువుతుంద‌న్న‌ది రెండు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మొద‌టిది మీరు ఏ వాహ‌నం కోసం తీసుకుంటున్నారు అంటే కార్‌, జీప్‌, వ్యాన్‌, బ‌స్‌, ట్ర‌క్‌, వాణిజ్య వాహ‌నాలు వంటివి. రెండోది.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్‌ను తీసుకుంటార‌న్న‌దానిపై కూడా ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ మీ కారుకు పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాల‌ని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, క‌నీస బ్యాలెన్స్ రూ.150 కూడా ఉంటుంది. ఇక ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయ‌డానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.200 క‌నీస బ్యాలెన్స్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఫాస్టాగ్‌ల‌పై ప‌లు బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నాయి.

రీఛార్జ్ ఎలా?
ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చాలా ఈజీ. మీరు ఏ బ్యాంక్ నుంచి కొన్నారో.. దాని ఫాస్టాగ్‌ వాలెట్‌లోకి వెళ్లి ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్‌, క్రెడిట్ కార్డ్‌, లేదా యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. ఇంకా ఈజీగా రీఛార్జ్ చేసుకోవాలంటే పేటీఎం, ఫోన్‌పె, అమెజాన్ పే, గూగుల్ పేలాంటివి వాడొచ్చు. ఇవి ఏ బ్యాంక్ ఫాస్టాగ్‌కైనా రీఛార్జ్ ఆప్ష‌న్ ఇస్తున్నాయి.