రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వాళ్లు ఉండకూడదు : సుప్రీం

ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా పనిచేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలని పేర్కొంది. అదే విధంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం సూచిస్తోందన్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వాళ్లు ఉండకూడదు : సుప్రీం

Government Official Cant Be Election Commissioner Top Court Rebukes Goa

Updated On : March 12, 2021 / 5:17 PM IST

ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా పనిచేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలని పేర్కొంది. అదే విధంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం సూచిస్తోందన్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది.

గతేడాది ఫిబ్రవరిలో జరగాల్సిన గోవా స్థానిక సంస్థల‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం అక్క‌డి ప్ర‌భుత్వం త‌మ న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. గోవాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్‌ కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఇంఛార్జ్‌ ఎన్నికల కమిషనర్‌ ఇచ్చారు. అయితే, దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు..ఆ నోటిఫికేషన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ కేసు విచారించిన జస్టిస్‌ రోహింగ్టన్‌ నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ హృషికేష్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం..బాంబే హైకోర్టు తీర్పును సమర్ధించింది.

ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం సూచిస్తోందన్న విషయాన్ని సుప్రీం మరోసారి గుర్తుచేసింది. ఎన్నిక‌ల క‌మిన‌ర్‌గా ఓ ప్రభుత్వాధికారిని ఎలా నియ‌మిస్తారంటూ గోవా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడైనా స్వతంత్రంగానే ఉండాలని, దాని బాధ్యతలను ఓ ప్రభుత్వాధికారికి అప్పగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలి నారిమన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. గోవాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని తెలిపింది. ఆయనని తక్షణం తప్పించాలని సూచించింది. ఇక, గోవాలో పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి 10 రోజుల్లోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఏప్రిల్‌ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని గోవా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.