బెడ్ షీట్ల సాయంతో పారిపోవడానికి ప్రయత్నించిన కరోనా పేషెంట్

బెడ్ షీట్ల సాయంతో పారిపోవడానికి ప్రయత్నించిన కరోనా పేషెంట్

Updated On : April 6, 2020 / 8:19 AM IST

కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన  55 సంవత్సరాల వ్యక్తి తప్పించుకోవాలని.. ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్లోని ఆరో అంతస్థులో ఉన్న ఐసోలేషన్ వార్డు నుంచి బెడ్ షీట్ల సాయంతో పారిపోవాలనుకున్నాడు. కర్నాల్ లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ కిటికీ నుంచి తెల్లవారుజాము 4గంటలకు ప్లాన్ చేసుకున్నాడు. బెడ్ షీట్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు కట్టి కిటికీ ఎక్కాడు. బెడ్ షీట్లకు కట్టిన ప్లాస్టిక్ కవర్ చినిగిపోవడంతో జారి కిందపడి మృతి చెందాడు. 

పానిపట్ లో నివాసముండే ఈ వ్యక్తిని ఏప్రిల్ 1న హాస్పిటల్లో చేర్పించారు. లక్షణాలు కనిపించడంతో పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు రాకపోయినా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఇంకా రక్త పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ మరణం తర్వాత ఐసోలేషన్ వార్డుకు ఉన్న సెక్యూరిటీపై సందేహాలు మొదలయ్యాయి. 

ఆదివారం ఢిల్లీలోని ఏఐఐఎమ్ఎస్ ట్రామా సెంటర్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనిని కూడా కరోనా లక్షణాలున్న వ్యక్తిగా అనుమానించి ఐసోలేషన్ లో ఉంచారు. హర్యానాలో ఇప్పటి వరకూ 84 కరోనా కేసులు నమోదుకాగా, ఒకరు మాత్రమే మృతి చెందారు. 58ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్ లక్షణాలతో కర్నాల్ లోని పీజీఐఎమ్ఈఆర్ హాస్పిటల్ లో చనిపోయినట్లుగా  రిపోర్టులు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 4వేలు దాటాయి. 100మందికి పైగా చనిపోయారు. (ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలు డౌటే..)