కశ్మీర్ కు బయలుదేరిన ఈయూ ఎంపీల బృందం

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2019 / 04:06 AM IST
కశ్మీర్ కు బయలుదేరిన ఈయూ ఎంపీల బృందం

Updated On : October 29, 2019 / 4:06 AM IST

యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల  బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర్ చేరుకుని జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లలో పర్యటించనున్నారు. తమ పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్‌ ను, కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం అధికారులను, శ్రీనగర్‌ లో స్థానికులను కలుసుకోనున్నారు.

సోమవారం ఈ బృందం ప్రధానమంత్రి నరేంద్రమోడీ,ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ లో ప్రస్థుత పరిస్థితులను మోడీ,దోవల్ ఈ బృందానికి వివరించారు. ఈయూ పార్లమెంటు సభ్యుల భారత్ పర్యటన ఫలప్రదం కావాలని మోడీ అభిలషించారు. ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటన ద్వారా అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, మత వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటారని కూడా ప్రధాని అభిలషించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రాధాన్యతలపై వారికొక స్పష్టత వస్తుందని, తమ హయాంలోనే భారత్‌లో పర్యటించాలని ఈయూ ఎంపీలు నిర్ణయించుకోవడం సంతోషమన్నారు.

కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత ఒక విదేశీ ప్రతినిధి బృందాన్ని అక్కడ పర్యటించేందుకు భారత్ అనుమతించడం ఇదే ప్రథమం. యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు నాథన్ గిల్ మాట్లాడుతూ…విదేశీ ప్రతినిధి బృందంగా కశ్మీర్‌కి వెళ్లే మంచి అవకాశం అభించిందన్నారు. అసలు వాస్తవంగా అక్కడ  ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా చూడగలిగే మంచి అవకాశం లభించిందన్నారు.

ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వ్యాలీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఒక్కొక్కటిగా కశ్మీర్ లో ఆంక్షలను సడలిస్తుంది ప్రభుత్వం. అదుపులోకి తీసుకున్న పలువురు నాయకులను వదిలిపెట్టారు. అయితే అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరు నాయకులను వెంటనే రిలీజ్ చేయాలని భారత్ ను ఇటీవల అమెరికా కోరింది. కశ్మీర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు అంతర్జాతీయ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ దేశ పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వైట్ హౌస్ తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల పోస్ట్ పెయిడ్ సర్వీసులను వ్యాలీలో పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ ఆరోపణలు చేయడం,దానికి అమెరికా వంత పాడటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కళ్లారా ప్రపంచానికి చూపించేందుకు విదేశీ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు భారత్ అనుమతించింది.