కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..వెల్లుల్లి: కిలో రూ.250

ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది. మహారాష్ట్ర నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లి, వెల్లుల్లి దిగుబడి తగ్గిపోవటంతో ధరలు భారీగా పెరిగాయి. మహారాష్ట్రలో తరచూ భారీ వర్షాలు కురవటం..వరదలు వెల్లువెత్తటంతో పంటలు నాశనం కావటంతో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశనంటాయి. కిలో ఉల్లి రూ.150కి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి మాత్రమే దిగుబడి ఉండటంతో ధరల రేట్లు ఏమాత్రం తగ్గటంలేదు. డిమాండ్ తగ్గిన ఉత్పత్తి లేకపోవటంతో ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు రేట్లు భారీగా పెరిగాయి. గత రెండు నెలల క్రితం కిలో ఉల్లి రూ.20 ఉండగా అది అమాతం పెరిగి రూ.50కి చేరగా ప్రస్తుతం రూ.70 నుంచి 100వరకూ అమ్ముతున్నారు వ్యాపారులు. అలాగే వెల్లుల్లి కూడా రెండు నెలల క్రితం కిలో రూ.70 నుంచి 90 ఉండగా ప్రస్తుతం రూ.250కి చేరుకుంది.