Hemant Soren Arrested: హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. బీజేపీపై రాహుల్, ఖర్గే ఫైర్

హేమంత్ సోరెన్ అరెస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ సంస్థలు కావు.. ఇప్పుడు అవి ...

Hemant Soren Arrested: హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. బీజేపీపై రాహుల్, ఖర్గే ఫైర్

Hemant Soren

Hemant Soren : భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని హేమంత్ సొరేన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. సుమారు ఆరు గంటలకుపైగా విచారణ అనంతరం రాత్రి 10గంటల సమయంలో సొరేన్ ను అరెస్టు చేసి రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టులో ఈడీ కస్టడీని కోరనుంది.

Also Read : ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామా.. కొత్త సీఎంగా చంపై సోరెన్.. ఈ ‘జార్ఖండ్ టైగర్’ ఎవరో తెలుసా?

అంతకుముందు సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎంగా అతని భార్య కల్పనా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఊహించని విధంగా హేమంత్ సొరేన్ కు సన్నిహితుడైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్ ఝార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయీ సోరెన్ ను ఎన్నుకున్నట్లు ఝార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖతో ఎమ్మెల్యేలంతా మూడు బస్సుల్లో రాజ్ భవన్ కు చేరుకున్నారు. అందులో 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీలైనంత త్వరగా చంపయీ సోరెన్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు. అయితే, ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఇంకా సమయం ఇవ్వలేదు. ఇవాళ చంపయీ సోరెన్ ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మరోవైపు ఈడీ అరెస్ట్ తరువాత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ చర్యపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆయన పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ అనుభవ్ రావత్ చౌదరిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. మరోవైపు సోరెన్ అరెస్టు కు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు నిరసన తెలిపాయి. గిరిజన సంఘాలు గురువారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.

Also Read : ఉత్తరాంధ్రలో ఈసారి ఎగిరే జెండా ఏది? ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
హేమంత్ సోరెన్ అరెస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ సంస్థలు కావు.. ఇప్పుడు అవి బీజేపీకి ప్రతిపక్షం లేకుండా చేసే సెల్ గా మారాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీయే అధికార వ్యామోహంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రచారాన్ని నడుపుతోందని విమర్శించారు.

మల్లిఖార్జున ఖర్గే ఏమన్నారంటే..
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఖండించారు. మోదీతో వెళ్లనివారు జైలుకు వెళ్తారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో ఈడీ బలవంతంగా రాజీనామా చేయించింది. ప్రతిపక్ష నేతలను భయపెట్టడం బీజేపీ టూల్ కిట్ లో భాగం. కుట్రలో భాగంగా విపక్ష ప్రభుత్వాలను ఒక్కొక్కటిగా బీజేపీ అస్థిరపరుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి కాపాడాలంటే బీజేపీని ఓడించాలి. మేం భయపడం.. పార్లమెంట్ నుంచి గల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.