Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది.. వైద్యులు ఏం చెప్పారంటే

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై వైద్యులు స్పష్టత ఇచ్చారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది.. వైద్యులు ఏం చెప్పారంటే

Kareena Kapoor arrived Lilavati hospital to meet Saif

Updated On : January 17, 2025 / 1:18 PM IST

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బాంద్రా వెస్ట్ లోని తన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడి సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ కు తీవ్రగాయాలు కాగా.. నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు సైఫ్ ను ఆటోలో స్థానిక లీలావతి హాస్పిటల్ కు తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు సైఫ్ అలీఖాన్ కు ఎలాంటి ప్రాణాప్రాయం లేదని, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే, గాయాలతో ఆస్పత్రిలో చేరి 24గంటలు గడిచినా సైఫ్ ఆస్పత్రిలోనే ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

 

ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే శుక్రవారం ఉదయం ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ‘‘సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఆయన్ను నడిపించేందుకు మేము ప్రయత్నించాం.  అతను బాగానే నడిచాడు. కానీ, అతని గాయాలు, సర్జరీల కారణంగా అతన్ని ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచాం. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించాం. అతనికి విశ్రాంతి అవసరం. మరో వారం రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి.’’ అని తెలిపారు. అయితే, ఉదయం 11.30 గంటల సమయంలో సైఫ్ సతీమణి కరీనా కపూర్ లీలావతి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు.

బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్టుమెంట్ లోని 12వ అంతస్తులో సైఫ్ అలీఖాన్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో అతని భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, వారి పిల్లలు నాలుగేళ్ల జేహ్, ఎనిమిదేళ్ల తైమూర్ ఉంటున్నారు. వీరికితోడు ఐదుగురు సహాయకులూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జేహ్ బెడ్ రూంలోకి దుండగుడు చొరబడి చిన్నారి కేర్ టేకర్ పై దాడి చేశాడు. అనంతరం ఆమె కేకలు వేయడంతో సైఫ్ అలీఖాన్ వెంటనే ఆ గదిలోకి వెళ్లాడు. అప్పటికే కేర్ టేకర్ ను నిందితుడు బంధించి కోటి రూపాయలు ఇవ్వాలని సైఫ్ ను డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, దొంగను పట్టుకునే క్రమంలో నిందితుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

 

నిందితుడు దాడిలో సైఫ్ అలీఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముక దగ్గరగా తీవ్ర గాయమైంది. ఆయనకు ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను శరీరంలో నుంచి బయటకు తీశారు. ఎడమ చేతికి, మెడ కుడి భాగానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సైఫ్ కు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. అయితే, శుక్రవారం ఉదయం వైద్యులు మాట్లాడుతూ.. అతను మాట్లాడుతున్నాడని.. మా సహాయంతో అతను కొద్దిగా నడిచాడని పేర్కొన్నారు.

 

గురువారం రాత్రి సైఫ్ అలీఖాన్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రజలకు, మీడియాకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. మీడియావర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలి. ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.’’ అంటూ కరీనా కపూర్ కోరారు.

 

సైఫ్ అలీఖాన్ పైదాడి తరువాత ఆయన నివాసం చుట్టూ మాత్రమే కాకుండా బాంద్రాలో నివసిస్తున్న ప్రముఖుల ఇళ్ల భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. సైఫ్ అలీఖాన్ పై దాడితరువాత ఆయన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆయన నివాసంలో సరైన భద్రతా చర్యలు లేకపోవటం పట్ల పోలీసులు షాక్ అయ్యారు. సైఫ్ నివాసంలో సరియైన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ లేదని, ఇంటికి సరియైన భద్రతా చర్యలు లేవని పోలీసులు గుర్తించారు. సందర్శకులను తనిఖీ చేయడానికి, ఏదైనా అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందించడానికి ప్రవేశ ద్వారం వద్ద, ప్లాట్ లోపల వ్యక్తిగత గార్డులు లేరట. బిల్డింగ్ సొసైటీలోకి ప్రవేశించే సమయంలోనూ లోపలి నుంచి బయటకు వెళ్లే సమయంలోనూ రిజిస్టర్ లాగ్ బుక్ లేదని ఓ అధికారి జాతీయ మీడియాతో మాట్లాడుతు పేర్కొనడం విశేషం.

 

సైఫ్ పై దాడికి పాల్పడిన నిందితుడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. దాడి జరిగిన 33గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. విచారణ పూర్తయిన తరువాత అతను ఎందుకు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాలపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.