మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అభినందన్

పాకిస్తాన్ కబంద హస్తాల్లో చిక్కి భారత ప్రభుత్వం చొరవతో చిట్టచివరకు భారత్ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్ వర్గాలు అభినందన్ ను శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతానికి తీసుకుని రాగా అక్కడి నుంచి చెక్ పోస్టులో భారత్, పాక్ వర్గాలు పరస్పరం పత్రాలు మార్చుకోవడంతో పాకిస్తాన్ వర్గాలు భారత్ కు అభినందన్ ను అప్పగించాయి.
అనంతరం, పాకిస్తాన్ సైనిక సిబ్బంది తమ వాహనాల్లో తిరిగి లాహోర్ వెళ్లిపోయారు. అయితే, అభినందన్ మాట్లాడతాడని ఆశించిన మీడియా ప్రతినిధులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాక్ సైన్యం అభినందన్ ను తీసుకువచ్చి భారత వాయుసేన ఉన్నతాధికారులకు అప్పగించగా, అభినందన్ వచ్చిన అధికారులతో కలిసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయాడు.
అభినందన్ ను చూడగానే భావోద్వేగానికి గురైన ఎయిర్ ఫోర్స్ అధికారులు అతడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వాహనం ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. అమృత్ సర్ లో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపై ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని భారత వాయుసేన భావిస్తోంది.