Yoga Guru Ramdev: రాందేవ్ బాబాపై రూ.1000కోట్ల ప‌రువు న‌ష్టం కేసు

Yoga Guru Ramdev: రాందేవ్ బాబాపై రూ.1000కోట్ల ప‌రువు న‌ష్టం కేసు

Yoga Guru Ramdev

Updated On : May 26, 2021 / 1:34 PM IST

Thousand crore defamation: క‌రోనాను నియంత్రించ‌డంలో అల్లోప‌తి వైద్యం విఫలం అయ్యిందంటూ ఆరోపించిన యోగా గురువు రాందేవ్ బాబాపై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్(IMA) ఉత్త‌రాఖండ్ శాఖ రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా రాందేవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కోవిడ్‌ వైరస్‌ను తగ్గించేందుకు అల్లోపతి విధానం పనికిరాదని అనడంపై డాక్టర్ల సంఘం భగ్గుమంది.

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో అల్లోప‌తి వైద్యంపై తాను చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై క్ష‌మాప‌ణ కోరుతూ వీడియోను పోస్టు చేయ‌క‌పోయినా, రాబోయే 15 రోజుల్లో రాత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోయినా, రాందేవ్ బాబా రూ. 1000 కోట్ల ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని ఐఎంఏ ఉత్త‌రాఖండ్ శాఖ త‌మ ప‌రువు న‌ష్టం దావా నోటీసులో పేర్కొన్న‌ది. రాందేవ్ బాబాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర్థ‌సింగ్ రావ‌త్‌కు కూడా ఐఎంఏ ఉత్త‌రాఖండ్ శాఖ లేఖ రాసింది.

రాందేవ్‌పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. దీంతో తన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ వెనక్కి తగ్గారు. అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అదే సమయంలో అల్లోపతి డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ.. 25 ప్రశ్నలను సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వివాదంపై ట్వీట్ ద్వారా చెప్పిన క్షమాపణ సరిపోదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది. అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచేలా మాట్లాడిన బాబా రాందేవ్‌ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది.