అంబానీలకు షాక్ : ఐటీ నోటీసులు జారీ

  • Published By: chvmurthy ,Published On : September 14, 2019 / 05:01 AM IST
అంబానీలకు షాక్ : ఐటీ నోటీసులు జారీ

Updated On : September 14, 2019 / 5:01 AM IST

ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ కుటుంబానికి నోటీసులిచ్చినట్లు తెలిసింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది.  బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికల ద్వారా వెల్లడయ్యింది. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది.

అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు  అనేక దేశాల్లో వీరికి ఉన్న విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని ఆనివేదికల్లోని సమాచారం. 2019 మార్చి 28న  ముంబైలోని అదనపు ఆదాయ పన్ను కమిషనర్‌ ద్వారా బ్లాక్ మనీ సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ), టాక్స్ యాక్ట్ 2015 ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది.  హెచ్‌ఎస్‌బీసీ ద్వారా, స్విస్ లీక్స్ ద్వారా , ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి.

ఈ ఖాతాలను విశ్లేషణ చేయగా వీటిలో ఎక్కువ ఖాతాలు మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించబడ్డాయని గుర్తించారు. లభించిన సమాచారం మేరకు 14 కంపెనీలలో ఒకదానిలో “అంతిమ లబ్ధిదారులు” గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ, వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది.  మరోవైపు ఈ ఆరోపణలను రిలయన్స్ ప్రతినిధులు ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని పేర్కొన్నారు.