పారిస్ ఒప్పందం అమలుపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2020 / 09:36 PM IST
పారిస్ ఒప్పందం అమలుపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

Updated On : December 2, 2020 / 9:49 PM IST

high-level committee to implement Paris Agreement వాతావరణ మార్పులపై కుదిరిన “పారిస్ ఒప్పందం”పూర్తిస్థాయి అమలుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అంతర్ మంత్రిత్వశాఖల అధికారులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.



అపెక్స్​ కమిటీ ఫర్​ ఇంప్లిమెంటేషన్​ ఆఫ్​ పారిస్​ అగ్రిమెంట్​(AIPA) పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ. 2021 నుంచి పారిస్ ఓప్పందం అమలులోకి రానున్న నేపథ్యంలో అపెక్స్‌ కమిటీ ఏర్పాటు తప్పనిసరి అయిన నేపథ్యంలోనే 17 మంది సీనియర్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం.



ఈ కమిటీ చైర్మన్ గా అటవీ,పర్యవారణశాఖ కార్యదర్శి, ఉప చైర్మన్ గా అటవీ,పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఉంటారు.అటవీ, పర్యావరణ శాఖ అదనపు డీజీ, ఆర్థిక,వ్యవసాయ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన, జలశక్తి,విద్యుత్‌,భూభౌతిక,ఆరోగ్య కుటుంబ సంక్షేమ,గ్రామీణాభివృద్ది,విదేశీ వ్యవహారాలు,వాణిజ్య పరిశ్రమల సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.



దేశంలో కర్బన ఉద్గారాలు ఎక్కువగా వస్తున్న ప్రదేశాలను గుర్తించి వాటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ కమిటీ చర్యలు చేపడుతది. అందుకు అవసరమైన నియమ నిబంధనలు, తప్పనిసరి చేయాల్సిన కార్యకలాపాలను అమలులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తది. ప్రైవేటు సంస్థలనూ ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసేందుకు వారితో ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకొని జాతీయ దృక్పథంతో పనిచేసేలా చూడటం ఈ కమిటీ బాధ్యత. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు ముమ్మరం చేయడం సహా సంస్థాగత, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టేలా ఈ కమిటీ పనిచేస్తుంది.



కాగా.. గ్లోబల్ వార్మింగ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో,వాతావరణ మార్పుల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాల మధ్య 2015లో పారిస్ ఒప్పందం కుదురిన విషయం తెలిసిందే. పారిస్ ఒప్పందంలో భారత్ కూడా చేరిన విషయం తెలిసిందే. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది పారిస్ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.