3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని సముద్రగర్భం నుంచి కొట్టిపడేయొచ్చు.. కే-4 మిసైల్‌ పరీక్ష సక్సెస్‌.. ఇక భారత్‌ చేతిలో..

ఐఎన్‌ఎస్ అరిఘాత్ దీర్ఘ పరిధి సామర్థ్యం, మెరుగైన సాంకేతికత వల్ల ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా మనకు రక్షణగా నిలుస్తుంది.

3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని సముద్రగర్భం నుంచి కొట్టిపడేయొచ్చు.. కే-4 మిసైల్‌ పరీక్ష సక్సెస్‌.. ఇక భారత్‌ చేతిలో..

Updated On : December 25, 2025 / 3:18 PM IST

INS Arighaat: బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి కే-4 క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. 3,500 కిలోమీటర్ల పరిధి వరకు కే-4 క్షిపణి దూసుకెళ్లగల ఆపరేషనల్ సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈ ప్రయోగ ఫలితాలను అధికారులు విశ్లేషిస్తారు.

ఇదే జలాంతర్గామి (ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి) నుంచి గత ఏడాది నవంబర్‌లో కూడా ఈ బాలిస్టిక్ క్షిపణి (కే-4) పరీక్ష జరిగింది. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను గత ఏడాది నౌకాదళంలో చేర్చిన విషయం తెలిసిందే. శత్రుదేశాలు అణు దాడి చేస్తే ప్రతిదాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది.

ఐఎన్‌ఎస్ అరిఘాత్ దీర్ఘ పరిధి సామర్థ్యం, మెరుగైన సాంకేతికతతో ఈ బాలిస్టిక్ క్షిపణి ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా ఉన్న ప్రత్యర్థులను ఎదుర్కొనేలా మనదేశ నౌకాదళాన్ని గణనీయంగా బలపరుస్తోంది. దీర్ఘశ్రేణి అణు నిరోధకతలో జలాంతర్గామి ప్రయోగ క్షిపణులు మూలస్తంభంగా మారుతున్నాయి. 2016లో నౌకాదళంలో చేరిన అణుశక్తితో నడిచే మనదేశ తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో 750 కిలోమీటర్ల పరిధికి పరిమితమైన కే-15 క్షిపణులను అమర్చారు.

ఇప్పుడు దీర్ఘశ్రేణి టార్గెట్లను కే-4తో ఛేదించవచ్చు. ఇంతకు ముందు K-4 పరీక్షలను సబ్‌మెర్సిబుల్ పాంటూన్‌ల నుంచి నిర్వహించారు.

సముద్ర మట్టానికి దిగువ భాగంలో ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ దేశ అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే కీలక వేదికగా నిలుస్తోంది.
సముద్ర ఉపరితలంపైకి రావాల్సిన అవసరం లేకుండానే, సముద్ర గర్భంలో నుంచే క్షిపణి దాడులు చేయవచ్చు.

భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ రెండో అణు జలాంతర్గామి. ఇప్పటికే భారత నౌకాదళానికి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సేవలు అందుతున్నాయి. అంటే ఈ రెండు నౌకాదళంలో చేరాయి.

మరో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధమాన్ సముద్ర పరీక్షల దశలో ఉంది. ఇది ఇంకా నౌకాదళంలో క్రియాశీలకంగా లేదు.

అణు జలాంతర్గాములను గుర్తించడం అత్యంత కష్టం. అవి సంప్రదాయ జలాంతర్గాముల కంటే సైలెంట్‌గా పనిచేసుకుపోతాయి. నెలల తరబడి నీటిలోనే ఉండగలవు. భూతల, గగన, సముద్ర మార్గాల నుంచి అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం కలిగిన భారత వ్యూహాత్మక వ్యవస్థను ఐఎన్‌ఎస్ అరిఘాత్ మరింత బలోపేతం చేస్తుంది.