vemulawada : అతను ఎల్ఎల్బీ.. ఆమెది బీకామ్.. కానీ, గుడి మెట్లపైనే జీవనం.. ఓ జంట కన్నీటి గాథ
vemulawada : పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలంధర్ రెడ్డి డిగ్రీ, ఎల్ఎల్బీ చేయగా.. అతని భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. వీరిద్దరూ 2006లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారు గుడిమెట్లపై జీవనం సాగిస్తున్నారు.
Jalandhar Reddy, Sirisha
- భర్త ఎల్ఎల్బీ, భార్య బీకామ్
- ఉన్నతచదువులు చదివి గుడి మెట్లపైనే జీవనం
- వేములవాడలో ఓ జంట కన్నీటి గాథ
vemulawada : కరోనా మహమ్మారి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కొందరు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడగా.. మరికొందరు ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వలేక రోడ్డున పడ్డారు. ఇందులో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఒకరు.
Also Read : తెలంగాణలో ఆసక్తికరంగా రాజ్యసభ ఎన్నికల రాజకీయం.. జంపింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలంధర్ రెడ్డి డిగ్రీ, ఎల్ఎల్బీ చేయగా.. అతని భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. వీరిద్దరూ 2006లో పెళ్లి చేసుకున్నారు. జలంధర్ రెడ్డి కరీంనగర్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ అద్దె ఇంట్లో కాపురం మొదలు పెట్టాడు. కరోనా తరువాత ఆయన ప్రాక్టీస్ దెబ్బతిన్నది. ఆర్థిక సమస్యలకు తోడు శిరీష అనారోగ్యం పాలవడంతో అనేక ఆస్పత్రులకు తిరిగారు. అయినా శిరీష ఆరోగ్యం నయంకాలేదు. వీరికి సంతానం కూడా లేకపోవటంతో జీవితంపై విరక్తి చెందారు. రెండేళ్ల క్రితం వేములవాడ వచ్చి.. రాజన్న ఆలయ పరిసరాల్లో ఉంటున్నారు.
రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి, అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేసేవాళ్లకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో జలంధర్ రెడ్డి, ఆయన భార్య విషయం వెలుగులోకి వచ్చింది. వీరి గురించి తెలుసుకున్న అధికారులతోపాటు.. స్థానిక ప్రజలు షాక్ కు గురయ్యారు.
గుడిమెట్ల వద్ద భిక్షాటన చేస్తున్న విషయంపై జలంధర్ రెడ్డి స్పందిస్తూ.. కరోనాతో మా బతుకు దుర్భరంగా మారింది. ప్రాక్టీస్ దెబ్బతిన్నది. నా భార్య అనారోగ్యంతో ఉంటే అనేక ఆస్పత్రులకు తిరిగినా నయం కాలేదు. నా భార్యకు రాజన్న కలలోకి వచ్చాడని ఇక్కడికి చేరుకుంది. ఆమెను వెతుక్కుంటూ తరువాత నేను కూడా వచ్చాను. రోజూ రాజన్న గుడిమెట్లను శుభ్రం చేస్తుంటాం. చేయిచాచి ఎవర్నీ డబ్బులు అడగం, ఇస్తే తీసుకుంటాం. భిక్షాటన చేసేవాళ్లతో మమ్మల్ని అధికారులు ఆశ్రమానికి తరలించారు. కానీ, మళ్లీ గుడిమెట్ల దగ్గరికే వచ్చాం. ప్రభుత్వం ఉపాధి చూపిస్తే రాజన్నగుడి మెట్లను వదిలివెళ్తామని జలంధర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
అయితే, నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్న తరుణంలో, భార్య క్షేమం కోసం సర్వం వదులుకుని అండగా నిలిచిన ఈ భర్త తీరు అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది.
