దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా…
వ్యాపార విలువలకు ఆయన పెట్టింది పేరు. దాతృత్వంలో ఆయనను మించిన వారు లేరు.

Ratan Tata Profile (Photo Credit : Google)
Ratan Tata : రతన్ నావల్ టాటా.. 1937 డిసెంబర్ 28 న ముంబైలో జన్మించారు. పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబలో ఆయన పుట్టారు. భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ నకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతి రతన్ టాటా. దేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు. వ్యాపారంలో విలువలు పాటించారు. దాతృత్వంలో గుర్తింపు పొందారు.
1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటాకు ముని మనడిగా జన్మించారు. కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి. 1961లో టాటా కంపెనీలో చేరారు. 1991 లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేశాక వారసునిగా బాధ్యతలు చేపట్టారు. టాటాను భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చారు. ఆయన హయాంలోనే ఐకానిక్ గ్లోబల్ బ్రాండ్ సంస్థలైన టెట్లీ(టాటా టీ), జాగ్వార్ ల్యాండ్ రోవర్(టాటా మోటర్స్), కోరస్ స్టీల్ ను(టాటా స్టీల్) టాటా సొంతం చేసుకుంది. 75 ఏళ్లు నిండిన తర్వాత, రతన్ టాటా 28 డిసెంబర్ 2012న టాటా గ్రూపులో తన కార్యనిర్వాహక అధికారాలకు రాజీనామా చేశారు.
వ్యాపార విలువలకు రతన్ పెట్టింది పేరు. దాతృత్వంలో ఆయనను మించిన వారు లేరు. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి వాటిని అద్భుతంగా నడిపించారు. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిస్తూ దేశ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. టాటా సన్స్ కంపెనీకి ఛైర్మన్ గా పని చేసి, గ్రూప్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. పేదలకు కోట్ల రూపాయల దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచ వ్యాపార రంగంలో అత్యున్నతమైన వ్యక్తిగా ఎదిగారు రతన్ టాటా.
ఒక్క ముక్కలో రతన్ టాటా గురించి చెప్పాలంటే.. ఆయనొక లెజెండ్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. అపారమైన దేశ భక్తి కలిగిన వ్యాపారవేత్త కూడా. అంతకు మించి గొప్ప సామాజిక కార్యకర్త. నిస్వార్థంతో కూడిన జీవనశైలి ఆయన ప్రత్యేకత. వందల కోట్లకు అధిపతి అయినా.. సింప్లిసిటీనే ఇష్టపడే వారు. గర్వం అనేది అస్సలు లేదు. అందరితోనూ ఇట్టే కలిసిపోతారు. ఆయన జీవనశైలి, దార్శనికత నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం మరెంతో ఆదర్శం.
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, రిస్క్ తీసుకోవడంలో ఆయనకు సాటి లేరు. రతన్ టాటా నాయకత్వంలో అత్యంత చర్చనీయాంశమైన కార్యక్రమాలలో ఒకటి టాటా నానో అభివృద్ధి, లాంచ్. ప్రపంచంలోని చౌకైన కారుని తీసుకొచ్చిన ఘనత రతన్ టాటాకే దక్కుతుంది. భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలకు మోటార్ సైకిళ్లకు సరసమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం నానో లక్ష్యం. భద్రతాపరమైన సమస్యలు, మార్కెట్ అవగాహన సమస్యలతో పలు విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ ఆవిష్కరణ టాటా నిబద్ధతను తెలియజేస్తుంది.
Also Read : రతన్ టాటా సక్సెస్ స్టోరీ.. యువతరానికే స్ఫూర్తిదాయకం.. వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే?