Indian Railways To Impose Rs 500 Fine For Not Wearing Masks On Trains Railway Premises
Railways to Fine Rs 500 for No Mask: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే పరిసరాలు, రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధనలు కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం అత్యవసరం. దీనికోసం గతేడాది మే 11న భారత రైల్వే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ మాస్క్‌లు విధిగా ధరించాలని సూచించింది. అయితే ఇప్పుడు ఈ మాస్క్‌ల వినియోగాన్ని ‘రైల్వే నిబంధనలు (రైల్వే పరిసరాలను అపరిశుభ్రం చేసే చర్యలకు జరిమానా విధించడం) 2012 యాక్ట్’ కిందకు తీసుకొచ్చాం. ఈ చట్టం ప్రకారం.. రైల్వే పరిసరాల్లో ఉమ్మడం లాంటివి చేస్తే వారిపై జరిమానా విధించొచ్చు. తాజా మార్పులతో మాస్క్‌లు ధరించని వారికి కూడా జరిమానా వేయనున్నాం. రైల్వే స్టేషన్లు, రైళ్లలో మాస్క్‌లు ధరించకుండా కన్పిస్తే రూ.500 వరకు జరిమానా ఉంటుందని రైల్వే శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని భయంతో వలస కార్మికులు మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తమ స్వంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.