భారత్‌లోని 40 శాతం సంపద అంతా ఒకే ఒక్క శాతం మంది సంపన్నుల వద్ద ఉంది: అధ్యయనంలో సంచలన విషయాలు
దేశ ఆదాయంలో 58%.. ఉన్నత వర్గంలో ఉన్న టాప్ 10% వారికే దక్కుతోంది.
India inequality: “భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు.. పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు” అన్న వాదన ఎన్నో ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం జపాన్‌ను సైతం అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగినప్పటికీ మన దేశంలో ఆర్థిక అసమానతలు ఏ మాత్రం తగ్గడం లేదు.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఆర్థిక అసమానత భారత్‌లో ఉందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026లో పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని 40 శాతం సంపద ఒకే ఒక్క శాతం మంది వద్ద ఉంది.
వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 అంచనాలను విశ్లేషకులు లుకాస్ చాన్సెల్, రికార్డో గోమెస్ కరెరా, రోవైదా మోష్రిఫ్, థామస్ పికెట్టి ఎడిట్ చేసి, ప్రచురించారు.
ఇటీవలి కాలంలో అసమానతలు తగ్గే సూచనలు కనపడకుండాపోయాయని ఆ రిపోర్టు తెలిపింది. భారత్‌లోని అత్యంత సంపన్న 10% వర్గం సుమారు 65% సంపదను పొందుతోందని నివేదిక తెలిపింది.
ఆదాయ అసమానలతు కూడా మామూలుగా లేవు. దేశ ఆదాయంలో 58% ఉన్నత వర్గంలో ఉన్న టాప్ 10% వారికే దక్కుతోంది. కిందిస్థాయిలో ఉన్న 50% వర్గం వారికి దేశ ఆదాయంలో కేవలం 15% మాత్రమే దక్కుతోంది.
Also Read: GHMCలో వార్డుల డీలిమిటేషన్‌పై గందరగోళం.. సర్కార్‌కు సవాళ్లు
2014 నుంచి 2024 వరకు దేశంలోని సంపన్న టాప్ 10% వర్గం, బాటమ్‌లోని 50% వర్గం మధ్య ఆదాయం వ్యత్యాసం స్థిరంగా ఉందని నివేదిక తెలిపింది. అంటే పదేళ్ల క్రితం దేశంలో అసమానతలు ఎలా ఉండేవో ఇప్పుడూ అలానే ఉన్నాయి.
భారతదేశంలో సగటు వార్షిక ఆదాయం పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా సుమారు 6,200 యూరోస్, అంటే దాదాపు రూ.6.49 లక్షలు. సగటు సంపద పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా సుమారు 28000 యూరోస్. మహిళల శ్రమ భాగస్వామ్యం 15.7% మాత్రమే ఉందని, గత దశాబ్దంలో పెరుగుదల లేకపోయిందని నివేదిక తెలిపింది.
ఇక మొత్తంగా భారతదేశంలో ఆదాయం, సంపద, లింగ పరమైన అసమానతలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక విభేదాలు స్పష్టంగా ఉన్నాయని ఇది సూచించింది.
