INS విక్రాంత్‌లో దొంగలు : భద్రతా వైఫల్యం

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 01:33 AM IST
INS విక్రాంత్‌లో దొంగలు : భద్రతా వైఫల్యం

Updated On : September 19, 2019 / 1:33 AM IST

భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో దొంగలు పడ్డారు. యుద్ధనౌక విషయంలో అధికారుల నిర్లక్ష్యం భద్రతా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఆటంకంగా మారనుంది. యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను కేరళలోని కొచ్చిషిప్‌యార్డ్‌లో రూపొందిస్తున్నారు. మరో రెండేళ్లలో ఇది భారత సైన్యానికి అందుబాటులోకి రానుంది.

దీని నిర్మాణ ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో కీలక సమాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ యుద్ధనౌకలో దొంగతనం జరిగింది. నాలుగు హార్ట్‌ డిస్క్‌లు, ర్యా మ్‌తో పాటు ప్రాసెసర్‌ చిప్‌లు చోరీకి గురయ్యాయి. కంప్యూటర్లను పగలగొట్టి వీటిని ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఈ పరికరాల్లో దేశరక్షణకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది. అప్‌లోడ్‌ చేసిన సమాచారం చాలా ముఖ్యమైనదని అధికారులు చెబుతున్నారు.

దేశంలో అత్యంత సురక్షిత ప్రాంతమైన కొచ్చి షిప్‌యార్డులో దొంగతనం జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. షిప్‌ యార్డులో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ…విక్రాంత్‌ యుద్ధనౌకలో మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కేరళ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. లోపలి వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భఆవిస్తున్నారు. 

ప్రపంచంలో ఇలాంటి యుద్ధనౌకలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ నౌకలో 30 యుద్ధ విమానాలు, హెలిక్యాప్టర్లను ఉంచడానికి వీలుంది. దీంతో శత్రు దేశాలు విక్రాంత్‌ వైపు కన్నెత్తి చూడలేవు.  2021లో ఇండియన్‌ నేవీలో చేరే విక్రాంత్‌…2023 నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించనుంది.