నీట్‌లో అర్హత సాధించిన తల్లీకూతుళ్లు.. ఒకే కాలేజీలో చేరకూడదని తల్లికి షరతు పెట్టిన కూతురు
తన కూతురు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కి సిద్ధమవుతున్న సమయంలో ఆమె చదువుతున్న పుస్తకాలను, కోచింగ్‌ను ఉపయోగించుకున్నారు. అముతవల్లి తన కలను నిజం చేసుకోవడానికి ఆమె కుటుంబం, ముఖ్యంగా ఆమె కూతురు సంయుక్త బాగా ఉపయోగపడ్డారు.

M Samyuktha-AMuthavalli Manivannan
చదువుకోవడానికి వయసు అడ్డుకాదని ఓ 49 ఏళ్ల మహిళ నిరూపించారు. తమిళనాడుకు చెందిన అముతవల్లి మనివన్నన్ అనే మహిళ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో అర్హత సాధించారు. వైద్య విద్యను అభ్యసించాలన్న తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. తన కూతురు NEETకి సిద్ధమవుతున్న సమయంలోనే మనివన్నన్ కూడా అదే పరీక్షకు ప్రిపేర్ కావడం గమనార్హం.
అముతవల్లి ఓ ఫిజియోథెరపిస్ట్. తన కూతురు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కి సిద్ధమవుతున్న సమయంలో ఆమె చదువుతున్న పుస్తకాలను, కోచింగ్‌ను ఉపయోగించుకున్నారు. అముతవల్లి తన కలను నిజం చేసుకోవడానికి ఆమె కుటుంబం, ముఖ్యంగా ఆమె కూతురు సంయుక్త బాగా ఉపయోగపడ్డారు.
తాజాగా వెలువడిన NEET ఫలితాల్లో తన కూతురితో పాటు అముతవల్లి అర్హత సాధించారు. పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీస్ (PWBD) కేటగిరీ కింద విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అముతవల్లి మెడికల్ సీటును పొందారు.
“ఆకాంక్షలకు వయస్సుతో సంబంధం లేదు. నేను చిన్నతనం నుంచే మెడిసిన్ చదవాలని అనుకున్నాను. కానీ అప్పట్లో నాకు సీటు రాలేదు. అందువల్ల, నేను ఫిజియోథెరపీ చదివాను” అని అముతవల్లి తెలిపారు. తెన్కాసిలో నివసిస్తున్న తాను NEET రాయాలని నిర్ణయించుకుని, తన కూతురు సంయుక్త సాయాన్ని తీసుకున్నానని చెప్పారు.
కుటుంబ సపోర్టుతో విజయం
“నా భర్త న్యాయవాది, ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. నా కూతురు నాకు కోచింగ్ ఇచ్చింది. నా మొదటి ప్రయత్నంలో NEET లో 147 మార్కులు వచ్చాయి. ఇప్పుడు నేను డిసెబిలిటీస్ కేటగిరీలో సీటు పొందాను. దీనిని నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను ఫిజియోథెరపీలో ప్రాక్టీస్ చేస్తున్నాను” అని అముతవల్లి చెప్పారు.
తన కూతురు తనకు ఒకే ఒక్క షరతు పెట్టిందని, ఇద్దరం ఒకే కాలేజీలో చేరకూడదని చెప్పిందని అముతవల్లి అన్నారు. తన తల్లి కల నెరవేరడం పట్ల సంయుక్త హర్షం వ్యక్తం చేసింది. తాను జనరల్ కేటగిరీ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పింది.