ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ వస్తువుల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగే చాన్స్.. సబ్బులు, షాంపూల రేట్లు కూడా..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు నష్టపోనున్నాయి.

Super markets
Iran Israel War: ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా అమెరికాసైతం నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. అయితే, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు నష్టపోనున్నాయి. ముడిసరుకుల ధరలు నిలకడగా ఉన్నాయని ఊపీరిపీల్చుకుంటుండగా.. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్యాకేజీంగ్, రవాణా ఖర్చులు పెరిగే పరిస్థితి వచ్చింది. దీంతో భారతదేశంలో అనేక రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగే చాన్స్ కనిపిస్తోంది.
సబ్బులు, స్నాక్స్, డిటర్జెంట్స్, పెయింట్స్ లాంటి రోజువారీ వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. జియోపొలిటికల్ టెన్షన్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి షార్ట్‌టర్మ్‌లో సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల ప్రొడక్ట్‌ల ధరలు పెరిగి, కస్టమర్లపై భారం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ధరల్లో ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి హైడెన్సిటీ పాలిథీన, ఇతర పాలిమర్స్ (క్రూడాయిల్ నుంచి వచ్చేవి) వాటా 15 నుంచి 20శాతం వరకు, రవాణా ఖర్చుల వాటా 30శాతం వరకు ఉంటుంది.
ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గాయని, ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదని కంపెనీలు చెబుతున్నాయి. అయితే, మరో 10 నుంచి 15రోజుల్లో ఆయిల్ ధరలు ఎంత పెరుగుతాయో చూసి ఏ స్థాయిలో ధరలు పెరుగుతాయో అంచనావేయగలమని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సేల్స్ హెడ్ చెప్పారు.
ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల్లో ఉపయోగించే ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్లో లీనియర్ అల్కైల్ బెంజీన్ (డిటర్జెంట్స్ లో), టైటానియం డైఆక్సైడ్ (క్యాండీస్, బేక్డ్ గూడ్స్, కాస్మెటిక్స్, పెయింట్స్ లో) ఉన్నాయి. డెకరేటివ్ పెయింట్స్ లో 300కిపైగా ఐటెమ్స్ ఉపయోగిస్తారు. వీటి ధరలు పెరిగితే ఫైనల్ ప్రొడక్ట్ రేటు పెరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇంకొన్నిరోజులు కొనసాగినా వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.