Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్త IRCTC వెబ్సైట్ రెడీ.. ఆ ఇబ్బందులకు ఇక స్వస్తి..
Indian Railways : కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్లో వేగవంతమైన టికెట్ బుకింగ్, మెరుగైన తత్కాల్ సేవలు, సీటు ఎంపిక సౌకర్యం, అధిక ట్రాఫిక్‌ను తట్టుకునే సాంకేతిక సామర్థ్యం వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Indian Railways
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైలు టికెట్ బుకింగ్ సమయంలో తరచూ ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ నుంచి పూర్తిగా అధునాత ఫీచర్లతో కూడిన ఐఆర్సీటీసీ (IRCTC)ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
రాజస్థాన్‌లోని ఎంఎన్ఐటీ జైపూర్ విద్యార్థుతో జరిగిన సమావేశంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా క్యాప్చా పనిచేయకపోవటం, లాగిన్ సమస్యలు, టికెట్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం, సెషన్ టైమ్ అవుట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలపై మంత్రి స్పందిస్తూ.. కొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జులై 15న కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రస్తుతం ప్రయాణికులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో సర్వర్ క్రాష్ అవడం.. ఓటీపీలు ఆలస్యంగా రావడం.. చెల్లింపు పూర్తయిన తరువాత కూడా టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం, అలాగే అనుమానాస్పద బాట్లు లేదా ఏజెంట్లు వేగంగా టికెట్లు బుక్ చేసుకోవటం ఉన్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 2.5కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేశారు. అయినప్పటికీ టికెట్ బుకింగ్ లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో అందుబాటులోకి రాబోయే కొత్త వెబ్సైట్ ద్వారా ప్రయాణికుల సమస్యలకు చెక్ పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్లో వేగవంతమైన టికెట్ బుకింగ్, మెరుగైన తత్కాల్ సేవలు, సీటు ఎంపిక సౌకర్యం, అధిక ట్రాఫిక్ ను తట్టుకునే సాంకేతిక సామర్థ్యం వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక మార్పులు అమల్లోకి వచ్చే ముందు ప్రయాణికులు తమ IRCTC లాగిన్ వివరాలను భద్రంగా ఉంచుకోవడం, ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల వివరాలను సేవ్ చేసుకోవడం, పెండింగ్ రీఫండ్లు లేదా వాలెట్ బ్యాలెన్స్‌లను ఒకసారి పరిశీలించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
