జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు 2024 : ఈ నెల 18న మొదటి దశ పోలింగ్.. 24 స్థానాలకు 219 మంది అభ్యర్థులు బరిలో..!
Jammu And Kashmir Elections 2024 : మొదటి దశ పోలింగ్‌లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Jammu And Kashmir Elections 2024 _ Phase 1 voting tomorrow
Jammu And Kashmir Elections 2024 : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ- కాశ్మీర్‌లో మొదటి దశ పోలింగ్‌కు వేదిక సిద్ధమైంది. సెప్టెంబర్ 18న జరగబోయే ఎన్నికల్లో 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో 90 మంది స్వతంత్రులతో సహా 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. మొదటి దశ పోలింగ్‌లో పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న ఏడు జిల్లాలు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయనున్నాయి. బుధవారం పోలింగ్ జరగనున్న 24 స్థానాల్లో 8 జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాల్లో, 16 కాశ్మీర్ లోయలోని 4 జిల్లాల్లో ఉన్నాయి.
Read Also : ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తున్న బీజేపీ
మొదటి దశ పోలింగ్‌లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం (EC) ప్రకారం.. పోలింగ్ సజావుగా సాగేందుకు 3,276 పోలింగ్ కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేయగా, మొత్తం 14వేల మంది పోలింగ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
10ఏళ్ల తర్వాత ఎన్నికలు.. మూడంచెల భద్రత ఏర్పాట్లు :
జమ్మూకాశ్మీర్ లో 10 ఏళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ ఎన్నికల్లో వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంత నాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో ఓటింగ్ జరుగనుంది. తొలి దశలో 23.27 లక్షల మంది ఓటర్లు
తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కి మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌ఓసీకి దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్‌ల వద్ద మరింత భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలటరీ బలగాలని కేంద్రం వినియోగిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
సీపీఐ (ఎం)కు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ వీరీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజౌరి-అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరాలో మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, ఎన్‌సీకి చెందిన బషీర్ అహ్మద్ వీరీ, బీజేపీకి చెందిన సోఫీ మహ్మద్ యూసఫ్‌లతో ముక్కోణపు పోటీలో ఉన్నారు.
కుల్గాం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తరిగామి వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ దూరు నుంచి మూడవసారి బరిలోకి దిగనున్నారు. ఎన్‌సీ సకీనా ఇటూ దమ్హాల్ హాజీపోరా నుంచి మరొకసారి పోటీ చేయనున్నారు. పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ (దేవ్‌సర్), అబ్దుల్ రెహ్మాన్ వీరి (శంగూస్-అనంతనాగ్) కూడా కీలక అభ్యర్థులుగా ఉన్నారు.
ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో రసవత్తర పోరు :
పుల్వామా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పీడీపీ యువజన విభాగం నేత వహీద్ పారా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్‌సీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్న తన మాజీ పార్టీ సహోద్యోగి మహ్మద్ ఖలీల్ బంద్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొనున్నారు. నిషేధిత జమాతే ఇస్లామీ మాజీ సభ్యుడు తలాత్ మజిద్ అలీ ఎంట్రీతో ఇక్కడ పోటీ మరింత రసవత్తరంగా మారింది. తరిగామి కూడా సాయర్ అహ్మద్ రేషిలో ఇదే అభ్యర్థితో పోటీ పడనున్నారు.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ మంత్రులు :
జమ్మూలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ మంత్రులు సజ్జాద్ కిచ్లూ (NC), ఖలీద్ నజిద్ సుహార్వర్ది (NC) వికార్ రసూల్ వానీ (కాంగ్రెస్), అబ్దుల్ మజిద్ వానీ (DPAP), సునీల్ శర్మ (BJP), రెండు ఏళ్ల క్రితం గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి చేరిన డీపీఏపీ ద్వారా టిక్కెట్ నిరాకరించడంతో శక్తి రాజ్ పరిహార్ (దోడా వెస్ట్), గులాం మహ్మద్ సరూరి, మూడోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.
ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమిలో ఉండగా, రెండు పార్టీలు ‘స్నేహపూర్వక పోటీ’ కోసం బనిహాల్, భదర్వా, దోడాలో అభ్యర్థులను నిలబెట్టాయి. రెబల్ ఎన్‌సీ నేత ప్యారే లాల్ శర్మ ఇందర్వాల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగనున్నారు. ఇద్దరు బీజేపీలో రెబెల్స్, రాకేష్ గోస్వామి, సూరజ్ సింగ్ పరిహార్ కూడా రాంబన్, పద్దర్-నాగ్సేని నియోజకవర్గాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మొదటి దశ పోలింగ్ జరిగే నియోజవర్గాలివే :
పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనాపోరా, షోపియాన్, డీహెచ్ పోరా, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, పహల్గామ్, ఇందర్వాల్, కిష్త్వార్, పద్దర్-నాగ్సేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్, షాంగస్-అనంతనాగ్ ఈస్ట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది.
Read Also : Atishi Delhi CM : కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీనే ఎందుకు? 6 ముఖ్య కారణాలివే..!