POKఏర్పాటుకు నెహ్రూనే కారణం…రాహుల్ బాబా ఇప్పుడే వచ్చారు

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఏర్పాటుకు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947 లో ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ” దీనికి కారణమని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఇవాళ(సెప్టెంబర్-22,2019)నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ…కాశ్మీర్ సంపూర్ణంగా భారత్ లో విలీనం కాకపోవడానికి జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడని, కశ్మీర్ సమస్యను నెహ్రూ కాకుండా మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించాల్సి ఉందన్నారు.
పటేల్ హ్యాండిల్ చేసిన రాష్ట్రాలన్నీ భారత్ లో సంపూర్ణంగా విలీనం అయ్యాయన్నారు. పాకిస్థాన్‌తో నెహ్రూ అకాల కాల్పుల విరమణ ప్రకటించకపోతే PoK ఉనికిలోకి వచ్చేది కాదని షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దులో కాంగ్రెస్ రాజకీయాలు చూసిందని,కానీ తాము అలా చూడలేదని అన్నారు. ఆర్టికల్ 370పై బీజేపీ వైఖరి గురించి మాట్లాడుతూ..తమకు ఇది జాతీయవాదమని అన్నారు. బీజేపీ ఎప్పుడూ ఒకే దేశం,ఒకే ప్రధాని,ఒకే రాజ్యాంగం ఐడియాను సమర్థించిందని అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ చర్య… రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాకు దారితీసిందని, చివరికి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి దారితీసిందని ఆయన అన్నారు. 1990- 2000 మధ్య 10 సంవత్సరాలలో 40 వేల మంది మరణించారన్నారు. కశ్మీరీ పండితులు, సూఫీలు మరియు సిక్కులను రాష్ట్రం నుండి తరిమికొట్టారని ఆయన చెప్పారు.
ఆర్టికల్ 370 రాజకీయ సమస్య అని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. రాహుల్ బాబా.. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ బీజేపీ మూడు తరాలు తమ జీవితాన్ని కాశ్మీర్ కోసం, ఆర్టికల్ 370 ను రద్దు చేసినందుకు ఇచ్చిందన్నారు. ఇది తమకు రాజకీయ విషయం కాదన్నారు. భారత్ మా ను అవిభక్తంగా ఉంచడం మా లక్ష్యంలో భాగం అని అమిత్ షా అన్నారు.