Jayalalitha properties auction : వేలానికి జయలలిత ఆస్తులు .. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
వేలానికి ‘అమ్మ’ జయలలిత ఆస్తులు సిద్ధంగా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జయలలితకు సంబంధించి ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి నగలు, 11వేల చీరలు, 750 జతల చెప్పులు, 131 సూట్ కేసులు, 10వందల40 వీడియో క్యాసెట్లు, ఇతర దుస్తులు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను వేలంవేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Jayalalithaa's properties auction
Jayalalitha properties auction : సినీ ప్రపంచంలో ధృవతారగా వెలిగినా..రాజకీయాల్లో చక్రం తిప్పినా..ప్రజలతో ‘అమ్మ’అంటూ ఆత్మీయంగా పిలిపించుకున్నా లెక్కకు మించిన ఆస్తులు సంపాదించి సంచలనం సృష్టించినా.. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంతో సాక్షాత్తు అసెంబ్లీలో దారుణమైన అవమానాన్ని భరించి..ఆ అవమానాన్ని అధిగమించి సీఎంగానే ఈ సభలో అడుగుపెడతానని శపథం చేసి అన్నట్లుగానే సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టినా అది దివంగత నేత..మాజీ సీఎం జయలలితకు మాత్రమే సాధ్యమైంది అంటూ అతిశయోక్తికాదు.
తమిళ ప్రజలు అమ్మ అని పిలుచుకునే జయలలిత ప్రాభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సినీ జీవితం, రాజకీయ జీవితం అంతా పెను సంచనలమే. ఆకర్షణీయ శక్తి, అంతులేని ప్రజాదరణ, అంతకుమించిన ఆత్మాభిమానం, తెలివితేటలు జయలలిత సొంతం. అందుకే ఎంజీ రామచంద్రన్ తర్వాత ఆమె అన్నాడీఎంకె పగ్గాలు చేజిక్కించుకోగలిగారు. వ్యతిరేకతను జయించి..పార్టీకి తానే సర్వస్వంగా మారారు. వ్యూహ చతురతతో పలుమార్లు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఐదేళ్లకోసారి అభిప్రాయాన్ని మార్చుకునే తమిళ ఓటర్లు 2016లో మాత్రం వరుసగా రెండోసారి అన్నాడీఎంకెను అధికారంలోకి తీసుకొచ్చారు. సంక్షేమ పాలనతో జయలలిత తమిళ ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. అంతకుముందే పురుచ్చితలైవిగా పిలుచుకున్న తమిళులు…సంక్షేమ పథకాల అమలు తర్వాత జయలలితలో నిజంగానే అమ్మను చూసుకున్నారు. హీరోయిన్ నుంచి రాజకీయ నాయకురాలు అయినప్పటికీ…సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగినప్పటికీ…జయలలితను దేశమంతా అంతులేని ప్రజాదరణ ఉన్న రాజకీయనాయకురాలిగానే గుర్తుంచుకుంది. అదే గుర్తింపుతో ఆమె చరిత్రలో నిలిచిపోయారు.
అలాంటి జయలలితపై 2011 ముందు వరకు ఉన్న ముద్ర, ఆమెపై వచ్చిన ఆరోపణలు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ..జయలలిత అక్రమార్జన కేసులు తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. 2014లో జైలు శిక్ష కూడా అనుభవించిన జయలలిత అక్రమాస్తుల కేసు…దేశంలో అప్పుడో హాట్ టాపిక్. జయలలిత మరణించిన ఆరేడేళ్ల తర్వాత…ఇప్పుడు మరోసారి ఆమె అవినీతి, అక్రమ సంపాదన, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. జయలలిత నుంచి 1996లో స్వాధీనం చేసుకున్నఆస్తులను వేలం వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించడంతో…అసలు ఆమె సంపాదన ఎంత…? ఆస్తులెంత..? అక్రమార్జన కేసు పూర్వాపరాలేంటి అన్నదానిపై అందరి దృష్టి పడింది.
ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి నగలు, 11వేల చీరలు, 750 జతల చెప్పులు, 131 సూట్ కేసులు, 10వందల40 వీడియో క్యాసెట్లు, ఇతర దుస్తులు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను వేలంవేసేందుకు కర్ణాటక ప్రభుత్వం – లాయర్ కిరణ్ ఎస్ జావలిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. వీటన్నింటినీ 1996, డిసెంబరు 11న జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అసలు జయలలిత అక్రమ సంపాదన గురించి, ఆమె విలాసవంతమైన జీవితం గురించి, జయలలిత నెచ్చెలి శశికళ గురించి….ప్రపంచానికంతటికీ తెలిసింది…అక్రమాస్తుల చర్చ మొదలయిందీ 1995లో. తన పెంపుడు కుమారుడు, శశికళ మేనల్లుడు సుధాకరన్‌కు ఆమె పెళ్లి చేసిన విధానం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. జయలలిత సంపద నేషనల్ టాపిక్ అయింది. ఒక పెళ్లి సందడి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడం అంటే మాటలు కాదు. ఆ రేంజ్‌లో ఆ పెళ్లి మారుమోగిపోయింది. ఆ వివాహానికి అయిన ఖర్చు..పెళ్లిలో జయలలిత, శశికళ వేసుకున్న నగలు వంటివి….తర్వాత కాలంలో పురుచ్చితలైవి రాజకీయ జీవితంపై పెను ప్రభావం చూపాయి.
ఆ పెళ్లికి రెండు లక్షల మంది అతిథులు హాజరయ్యారు. 1995లోనే ఈ పెళ్లికి 10కోట్లు ఖర్చుపెట్టారని ఆదాయపు పన్ను శాఖ అంచనావేసింది. రెండు కిలోమీటర్ల పొడవునా సాగిన బరాత్, 25వేల సామర్థ్యంతో 10 డైనింగ్ హాళ్లలో విందు ఏర్పాట్లు, 75వేల చదరపు కిలోమీటర్లలో వేసిన పెళ్లిమండపం, జయలలిత, శశికళ వేసుకున్న వజ్రాభరణాలు, పెళ్లికి అధికారయంత్రాంగాన్ని ఉపయోగించుకున్న విధానం…యావత్ దేశం దృష్టిని తమిళనాడుపై పడేలా చేశాయి. అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌ల కోసం 16లక్షలు ఖర్చుపెట్టారు 20వేల విలువైన. సిల్క్ చీర, ధోతితో వీఐపీలకు వెడ్డింగ్ కార్డులిచ్చారు. చెన్నైలోని ప్రముఖ హోటళ్లలో అతిథుల కోసం వెయ్యిరూమ్‌లు బుక్ చేశారు. పెళ్లి జరిగే వేదిక దగ్గర మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ తన సిబ్బందిని వందలమందిని మోహరించింది. పెళ్లికి హాజరయ్యే వీఐపీల కోసం రోడ్లను దిగ్బంధించారు. పెళ్లి జరిగే ప్రదేశానికి కరెంటు అందించేందుకు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ నిలిపివేసింది.
రాకపోకలకు ప్రభుత్వ వాహనాలను వినియోగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అధికారయంత్రాగం దుర్వినియోగం జాబితా చాంతాడంత అవుతుంది. అంగరంగ వైభవంగా జయలలిత చేసిన ఈ పెళ్లి దేశరాజకీయాల్లో ఆమెను అత్యంత అవినీతిపరురాలైన నాయకురాలిగా నిలబెట్టింది. 1991-96 మధ్య తొలిసారి జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తాను ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కేవలం ఒకే ఒక్కరూపాయి జీతం తీసుకుంటున్నాని చెబుతున్న ముఖ్యమంత్రి….పెంపుడు కుమారుడికి ఈ స్థాయిలో వివాహం జరిపించడం…అందరినీ నివ్వెరపరిచింది. ఈ పెళ్లి తర్వాత జయలలిత రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది.
ఖరీదైన పెళ్లితో జయలలితపై తమిళనాడుతో పాటు దేశమంతా విమర్శల వర్షం కురిసింది. ఇదే సమయంలో సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారు. ఆమె అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. 1996 జూన్ 14న జయలలితపై చెన్నై కోర్టులోనూ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుచేశారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని జయలలిత పదవినుంచి దిగిపోయే నాటికి జయలలితకు 66.65 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఆరోపణలు వచ్చాయి. 1991లో జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ఆస్తులు 20.01 కోట్లేనని సుబ్రహ్మణస్వామి తన పిటిషన్‌లో తెలిపారు. విజిలెన్స్, అవినీతి వ్యతిరేక విభాగం సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 1996 సెప్టెంబరు 18న FIR నమోదయింది. చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనూ జయలలిత నివాసాల్లో సోదాలు జరపడానికి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, సాక్షులను పరిశీలించడానికి అనుమతి లభించింది. అక్రమాస్తుల ఆరోపణలే 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితకు ఘోర పరాజయం కలిగించాయి. ఇలా జయలలిత జీవితంలో విజయాలు..అపజయాలు, ఆరోపణలు పెను సంచలనం కలిగించాయి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రాజకీయాల్లో జయకేతనం ఎగురవేసిన మహిళగా జయలలిత ఓ ఎగసిపడిన కెరటం..ఆమె రాజకీయ జీవితం వలెనే ఆమె మరణం కూడా పెను సంచలనంగా మారింది. ఓ మర్మంగా మిగిలిపోయింది. ఆమె మరణంపై ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు క్లారిటీ ఇచ్చినా ఆమె మరణం వెనుక ఏదో కుట్ర దాగుంది అనేది ప్రజలు నమ్ముతుంటారు.