రంజన్ గొగొయ్ పదవీ విరమణ: తర్వాతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన రంజన్ గొగొయ్, పలు కీలక కేసుల్లో తీర్పు ఇచ్చారు. అయోధ్య భూవివాదం కేసు నుంచి రాఫెల్ వరకు ప్రధాన కేసుల్లో ఆయన తీర్పు ఇచ్చారు. సీజేఐ హోదాలో చివరి రోజైన ఇవాళ తిరుమలలో గడిపారు రంజన్ గొగోయ్
వారం రోజులుగా పలు ప్రధాన కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన రంజన్ గొగొయ్, అయోధ్య భూవివాదం కేసు నుంచి రాఫెల్ కేసు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం రివ్యూ పిటిషన్, ఆర్టీఐ పరిధిలోకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం వంటి ప్రధాన కేసుల్లో తీర్పును ఇచ్చి చరిత్రలో సమస్యాత్మక కేసులకు పరిష్కారం చూపిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఈ క్రమంలోనే ఇవాళ(2019 నవంబర్ 17) పదవీవిరమణ చేశారు.
చివరి పనిదినంగా శుక్రవారం(2019 నవంబర్ 15) నాడు గొగోయ్ ఓ నోట్‌ను విడుదల చేశారు. బార్ సభ్యులు పరిమితికి మించి స్వేచ్ఛను వినియోగించుకోవడం లేదని ఆ నోట్‌లో వెల్లడించారు. జడ్జీలు పలు విషయాల్లో మౌనం వహిస్తున్నారంటే వారికి మాట్లాడటం చేతకాక కాదని, విధుల్లో భాగంగానే అలా ఉండవలసి వస్తోందన్నారు రంజన్ గొగోయ్.
ఇక సోమవారం(18 నవంబర్ 2019) తర్వాతి సీజేఐగా జస్టిస్ బోబ్డే(63) బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనను తదుపరి సీజేఐగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. 47వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఆయన పదవిలో ఉండనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బోబ్డే.. అయోధ్య తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యులు.