సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బోబ్డే ప్రమాణ స్వీకారం

  • Published By: vamsi ,Published On : November 18, 2019 / 04:29 AM IST
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బోబ్డే ప్రమాణ స్వీకారం

Updated On : November 18, 2019 / 4:29 AM IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ పదవీ విరమణ చేయగా ఇవాళ(18 నవంబర్ 2019) 47వ సీజేఐగా జస్టిస్‌ బోబ్డే(63) బాధ్యతలు చేపట్టారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనను సీజేఐగా నియమించారు రాష్ట్రపతి.

ఈ క్రమంలోనే జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30కి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దగ్గరుండి జరిపించారు.

సుప్రీంకోర్టులో ఎంతోమంది జడ్జిలు ఉన్నా కూడా బోబ్డేను తన వారసుడిగా చేయమని ప్రతిపాదించారు రంజన్ గొగోయ్. గొగోయ్ తర్వాత బోబ్డేనే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 18 నెలలు పనిచేసి ఏప్రిల్ 23, 2021లో రిటైర్మెంట్ తీసుకుంటారు.

1956 ఏప్రిల్ 24న నాగపూర్‌లో జన్మించిన జస్టిస్ బోబ్డే (63) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నాగపూర్ యూనివర్శిటీ నుంచీ లా డిగ్రీ తీసుకున్నారు. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. 1998లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు.

2000 మార్చి 29న జడ్జిగా బోబ్డే నియమించబడ్డారు. బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులు అయ్యారు. 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ బోబ్డే.. అయోధ్య తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యులు.