కమల్ హాసన్ పార్టీ సింబల్ టార్చ్ లైట్

కమల్ హాసన్ పార్టీ సింబల్ టార్చ్ లైట్

Updated On : January 16, 2021 / 8:07 AM IST

kamal haasan party : తమిళనాట కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తునే కేటాయించింది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసింది.

అయితే తాజాగా ఎన్నికల సంఘం టార్చ్‌లైట్ గుర్తును తమిళనాడులోని ఎంజీఆర్ మక్కల్ కచ్చి అనే రాజకీయ సంస్థతో పాటు పుదుచ్చేరిలోని ఎంఎన్‌ఎంకు కూడా కేటాయించింది. దీంతో కమల్ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. టార్చ్‌లైట్ గుర్తును తమకే కేటాయించేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయగా.. అదే సమయంలో ఎంజీఆర్ మక్కల్ కచ్చి పార్టీ అధినేత విశ్వనాథన్ ఈసీకి లేఖ రాశారు. తమకు ఎంజీఆర్ విగ్రహం, ఆయనకు దగ్గరి సంబంధం ఉండేలా మరేదైనా గుర్తును కేటాయించాలని కోరడంతో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ పుట్టిన రోజు నాడు తమకు ఈ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి, ఇందుకు సహకరించిన అందరికీ కమల్ కృతజ్ఞతలు తెలిపారు. టార్చ్‌లైట్‌తో వెలుగును విస్తరిద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ 3.77 శాతం ఓట్లను సొంతం చేసుకోగా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని గట్టిగా ప్రచారం చేస్తోంది.