Karnataka Election 2023 : కర్ణాటకలో బీజేపీ ‘అ..ఆ’ల జపం .. అవేమిటో తెలుసా..?

ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెప్పే ప్రధాని మోదీ కూడా కన్నడ నాట ఉచితాల ప్రకటన బాట పట్టారు. గెలుపు కోసం బీజేపీ 103 ముఖ్యమైన హామీలతో పాటు ‘ఆరు’ ముఖ్యమైన అంశాల ఆధారంగా ‘అ..ఆ’ అంటూ ఆరు అభివృద్ధి మంత్రాలను వల్లెవేస్తోంది. అవేమిటంటే..

Karnataka Election 2023 : కర్ణాటకలో బీజేపీ ‘అ..ఆ’ల జపం .. అవేమిటో తెలుసా..?

Karnataka Election 2023

Updated On : May 2, 2023 / 11:56 AM IST

Karnataka Election 2023 : మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ పోటీపడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఉచిత హామీలకు దూరమని చెప్పే బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కన్నడ సీమలో ఉచిత పథకాలకు తెరతీసింది. ఈ ఉచితాలను కూడా బీజేపీ పక్కా ప్లాన్ తో రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని ‘అ..ఆ’అక్షరాలతో మొదలయ్యేలా వెరీ ఇంట్రస్టింగా ఇన్నాయి. ఈ ఉచితాలు స్కీముల పేర్లు కాదని గమనించాలి.  బీజేపీ ప్రజలకు ఇచ్చే 16 ప్రధాన హామీలు..103 ముఖ్యమైన హామీలతో పాటు ‘ఆరు’ ముఖ్యమైన అంశాల ఆధారంగా అన్నం, అభయం, అక్షరం, ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి అనే ఆరు అంశాల అజెండాగా మ్యానిఫెస్టో తయారుచేసింది కమలం పార్టీ. ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెబుతుంటారు ప్రధాని మోదీ. కానీ దీనికి భిన్నంగా కర్ణాటకలో గెలుపు కోసం బీజేపీ కూడా ఉచితాల జపం ప్రారంభించింది. కర్ణాటకలో తప్పనిసరి పరిస్థితుల్లో కమల నాథులూ ఉచితాలను వల్లే వేయడం పోటీ తీవ్రతను తెలియజేస్తోంది.

కర్ణాటకలో ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరింది. ఎన్నికల తేదీకి మరో పది రోజులే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు ఉచిత హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. ఉచితంగా పాలు, ఏడాదికి మూడు గ్యాస్‌సిలిండర్లు ఇస్తామంటూ అధికార బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ఆకర్షిస్తోంది. మ్యానిఫెస్టో విడుదల చేయకపోయినా.. ఇప్పటికే ఆరు ప్రధాన హామీలతో ఎన్నికల రణ రంగంలో దూసుకుపోతోంది కాంగ్రెస్‌. ఇక తాము మాత్రం ఏం తక్కువ కాదనే రీతిలో జేడీఎస్‌ కూడా ఫ్రీ స్కీమ్స్‌తో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెప్పే ప్రధాని మోదీ మాటలు ప్రకటనలకే పరిమితం చేసేలా.. కన్నడ ఎన్నికల్లో ఉచిత పథకాలనే ఎంచుకుంది కమలం పార్టీ. కాషాయ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనా.. ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా భావించి ప్రతిపక్షాల సవాళ్లను అధిగమించాలనే కారణంతో ఉచిత పథకాల హామీలు గుప్పించింది బీజేపీ.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత హామీలు ఆకర్షిస్తున్నాయి. సమాజంలోని అన్ని వర్గాల అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చేలా 16 ప్రధాన హామీలు, 103 ముఖ్యమైన హామీలతో బీజేపీ మ్యానిఫెస్టో ప్రకటించింది. 16 ప్రధాన హామీలు కూడా ఆరు ముఖ్యమైన అంశాల ఆధారంగా రూపొందించింది. అన్నం, అభయం, అక్షరం, ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి అనే ఆరు అంశాల అజెండాగా మ్యానిఫెస్టో తయారుచేసింది కమలం పార్టీ. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, రోజూ అర లీటర్‌ పాలు, ఉచిత బియ్యం పథకాలను ప్రధానంగా ప్రవేశపెట్టింది బీజేపీ. బెంగళూరు నగర ఓటర్లను ఆకర్షించేలా కర్ణాటక అపార్ట్‌మెంట్ యాజమాన్య చట్టం సంస్కరిస్తామని హామీ ఇచ్చింది. అలాగే యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలు చేస్తామని ప్రకటించింది.

ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీనీ క్రమంగా తగ్గించింది. నగదు బదిలీ చేస్తామని గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీని పరిమితం చేసింది. ఏడాది తొమ్మిది సిలిండర్లే ఇస్తామని గతంలో ప్రకటించింది. కానీ, కర్ణాటక ఎన్నికల సమయంలో తన వైఖరిని మార్చుకుంది బీజేపీ. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఘనంగా ప్రకటించింది. ఉగాధి, వినాయకచవితి, దీపావళి పండగ కానుకగా ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇక ఎన్నికల ప్రకటన విడుదలకు ముందు కన్నడ సీమలో రచ్చరచ్చగా మారిన పాలు, పెరుగు వివాదంలో ఓటర్లను శాంతించే రీతిలో పోషణ పథకం కింద ఉచితంగా పాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు. పెరుగును దహీ అనాలని.. నందిని మిల్క్‌ డెయిరీకి ప్రత్యామ్నాయంగా అమూల్‌ పాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పోషణ పథకం కింద ఉచితంగా నందిని పాలు పంపిణీ చేస్తామని కన్నడిగుల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాషాయ నేతలు.

ఇవి కాకుండా ఉచిత ఆహార పథకంలో భాగంగా నెలనెలా ఐదు కిలోల చిరుధాన్యాలు అందజేస్తామని ప్రకటించింది బీజేపీ. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 10 లక్షల గృహ నిర్మాణాలు చేపడతామని, ఇళ్లులేని పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని వెల్లడించింది. విద్య, వైద్యం, ఉపాధి రంగాలను అభివృద్ధి చేస్తామని వివరించింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన గో సంరక్షణ విధానాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాంటి హామీలు ఇవ్వలేదని చెబుతున్నారు పరిశీలకులు. దక్షిణాదిలో ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బీజేపీ సిద్ధాంతాలను పక్కనపెట్టారని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటం వల్లే బీజేపీ తన విధానాలను సడలించుకుందని చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ కూడా పెద్ద ఎత్తున ఉచిత హామీలు గుప్పించడం బీజేపీని ప్రభావితం చేసిందంటున్నారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరు వాగ్ధానాలను మరిపించేలా బీజేపీ హామీలిచ్చిందని అంటున్నారు.