రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ

శకున్‌రాణి (70) అనే ఓటరు రెండుసార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమె ఒక్కసారే ఓటు వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నోటీసులో వి.అన్బుకుమార్ చెప్పారు.

రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ

Updated On : August 10, 2025 / 9:48 PM IST

ఒక మహిళ రెండుసార్లు ఓటు వేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై ఆయనకు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వి.అన్బుకుమార్ నోటీసులు జారీ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోసాలు జరిగాయని రాహుల్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

శకున్‌రాణి (70) అనే ఓటరు రెండుసార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రాథమిక విచారణలో ఆమె ఒక్కసారే ఓటు వేసినట్లు తేలిందని నోటీసులో వి.అన్బుకుమార్ చెప్పారు. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రం పోలింగ్ అధికారి జారీ చేసినది కాదని తెలిపారు.

Also Read: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన విషయాలు.. ఆడపిల్లలను పెంచే స్తోమత లేని దంపతుల వద్ద నుంచి శిశువులను తీసుకుని..

“పోలింగ్‌ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్‌రాణి రెండుసార్లు ఓటు వేసినట్లు మీరు చెప్పారు. విచారణలో శకున్‌రాణి తాను ఒక్కసారి మాత్రమే ఓటు వేశానని అన్నారు. రెండుసార్లు వేశానని మీరు చేసిన ఆరోపణలు తప్పని తెలిపారు” అని నోటీసులో వి.అన్బుకుమార్ పేర్కొన్నారు. శకున్‌రాణి లేదా ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారని తేల్చిచెప్పే ఆధార పత్రాలు ఇవ్వాలని, సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు.

కాగా, అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్ల పేర్లు ఉన్నాయని ఇటీవల రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని అన్నారు.