Kerala Assembly : లక్షద్వీప్ రగడ..కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను కేంద్రం వెనక్కి పిలిపించాలంటూ(రీకాల్ చేయాలని) సోమవారం కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

Kerala Assembly Passes Resolution Demanding Recall Of Lakshadweep Administrator
Kerala Assembly లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను కేంద్రం వెనక్కి పిలిపించాలంటూ(రీకాల్ చేయాలని) సోమవారం కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. లక్షద్వీప్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని, కేంద్రం తక్షణమే లక్షద్వీప్ అంశంపై జోక్యం చేసుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ప్రఫుల్ ప్రవేశ పెట్టిన పలు వివాదాస్పద సంస్కరణలను కూడా రద్దు చేయాలని తీర్మాణంలో పేర్కొంది. లక్షద్వీప్ ప్రజలకు ఈ తీర్మానం సంఘీభావం తెలిపింది.
ప్రధానికి నమ్మకస్థుడిగా పేరున్న ప్రఫుల్‌కు కొద్ది నెలల క్రితం లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయి. లక్షద్వీప్ కు కొత్త రూపం పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేషర్ ప్రపుల్ కే పటేల్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధి పేరుతో.. ప్రఫుల్ పటేల్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎదురు లేని, బలమైన అధికారాలు లభిస్తాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రజావ్యతిరేక ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం సమర్థించారు. ప్రపుల్ కే పటేల్ తీసుకున్న నిర్ణయాలపై స్థానికులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సేవ్ లక్షద్వీప్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
లక్షద్వీప్ లో కొత్తగా మారిందేంటీ
ఇప్పటివరకు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,మత్స్య,పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా,వాటిని అడ్మినిస్ట్రేటర్ పరిపాలన కిందకు తీసుకొచ్చారు.
ఇక్కడ మొన్నటివరకు మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు
లక్షద్వీప్ లో నేరాల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ గూండా చట్టాన్ని అమలుచేశారు
లక్షద్వీప్ లో అధికసంఖ్యలో మైనార్టీలు ఉంటారు. వారంతా మాంసాహారులు. అయినప్పటికీ జంతువధను, బీఫ్ ను నిషేధించారు.
తగిన పత్రాలు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాల పేరుతో చాలామంది ఇళ్లను కూలగొట్టారు. ఈ విషయంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలున్నాయి
కేరళలోని బైపూర్ నౌకాశ్రయం నుంచి అక్కడికి సరుకులు రవాణా అవుతుంటాయి. అయితే కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు.