Kerala Ayyappa Temple : శబరిమల దేవాలయానికి 28 రోజుల్లోనే రూ.148 కోట్ల ఆదాయం

కేరళలోని శబరిమల దేవాలయానికి స్వాములు పోటెత్తుతున్నారు. దీంతో దేవాలయానికి ఆదాయం భారీగా వస్తోంది. రెండేళ్లుగా కరోనాతో శబరిమల దేవాలయానికి స్వాములు రాలేదు. 2022లో స్వాములు భారీగా అయ్యప్పను దర్శించుకున్నారు. భారీగా కానుకలు సమర్పిచుకన్నాడు. ఇంకా ఈ సీజన్ పూర్తికాకుండానే దేవాలయానికి 28 రోజుల్లోనే రూ.148 కోట్ల ఆదాయం వచ్చింది.

Kerala Ayyappa Temple : శబరిమల దేవాలయానికి 28 రోజుల్లోనే రూ.148 కోట్ల ఆదాయం

kerala Ayyappa Temple revenue

Updated On : December 22, 2022 / 11:09 AM IST

kerala Ayyappa Temple : రెండేళ్లు ఆ స్వామిని దర్శించుకోకుండా ఆగారు. క్రమం తప్పకుండా మాలధారణ చేసే వాళ్లు కూడా.. రెండు సీజన్లు సైలెంట్‌గా ఊరుకున్నారు. కోవిడ్ ఆంక్షలతో.. ఆ శబరిగిరీషుని దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ కరోనా ఉనికిలో ఉన్నా.. ఊహించినంత ప్రమాదకరస్థాయిలో అయితే లేదు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కూడా కోవిడ్ ఆంక్షలను సడలించడంతో.. శబరిగిరులన్నీ భక్తజనంతో నిండిపోయాయ్. అయ్యప్పనామస్మరణతో మార్మోగిపోతున్నాయ్. రోజుకు సుమారు లక్ష మందికి పైనే భక్తులు.. అయ్యప్పను దర్శించుకుంటున్నారు.

ఊహించని ఆర్థిక సంక్షోభం, 2018లో మహిళల ఆలయ ప్రవేశంపై ఆందోళనలు, రెండేళ్ల పాటు కొనసాగిన కరోనా పరిస్థితులు, వీటన్నింటిని దాటుకొని.. శబరిమల అయ్యప్ప ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. శబరి మాత్రమే కాదు ఆ పరిసర ప్రాంతాలన్నీ అయ్యప్ప స్వాములతో సందడిగా కనిపిస్తున్నాయ్. భారీ సంఖ్యలో పోటెత్తిన స్వాములు, సాధారణ భక్తులతో శబరిగిరులన్నీ మార్మోగిపోతున్నాయి. కేరళ దారులన్నీ.. ఇప్పుడు శబరివైపే వెళుతున్నాయ్. ఎటు వైపు చూసినా.. అయ్యప్ప స్వాములే కనిపిస్తున్నారు.

నెత్తిన ఇరుముడిని మోస్తూ.. మనసులో ఆ మణికంఠుడిని స్మరిస్తూ.. సన్నిధానంలో స్వామిని దర్శిస్తూ.. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములంతా పరవశించిపోతున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయడం లేదు. కొందరు పంపా నది తీరం నుంచి.. మరికొందరు ఎరుమేలిలోని పెద్ద పాదం నుంచి.. ఇంకొందరు.. పులిమేడు నుంచి ఆ స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అటవీ ప్రాంతం గుండా ఉండే రాళ్లు, ముళ్లే.. కాళ్లకు మెట్టై.. ఆ స్వాములను నడిపిస్తున్నాయ్. ఎంతటి కష్టం ఎదురైనా.. అడవుల్లో ఎన్ని ఇబ్బందులు తలెత్తినా.. అవేవీ లెక్క చేయకుండా.. ఆ స్వామి దర్శనానికి తరలివస్తున్నారు స్వాములు. అంతటి చలిలో స్వెటర్లు ధరించేందుకు కూడా వీలుండదు. అయ్యప్ప దీక్షే అలాంటిది. విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని మరీ.. అయ్యప్పలు శబరిగిరులు ఎక్కుతున్నారు. కిలోమీటర్ల మేర నడిచి కూడా.. క్యూ లైన్లలో గంటలకొద్దీ వేచి స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆ స్వామిని దర్శించుకోగానే.. అక్కడిదాకా వచ్చేందుకు పడిన కష్టమంతా మర్చిపోతున్నారు.

అయ్యప్ప భక్తులు ఎంతో మహిమాన్వితమైనవిగా భావించే.. పవిత్రమైన పదునెట్టాంబడిపై నుంచి నిమిషానికి 65 మంది స్వాములు అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన 18 మెట్లతో పాటు స్వామి సన్నిధానంలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా చర్యలు తీసుకునేందుకు అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందిని నియమించారు. పూజా సమయంలోనూ భక్తులను ఆపకుండా.. స్వామిని దర్శించుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఆలయం తెరిచిన మొదట్లో.. వర్చువల్ క్యూ బుకింగ్ లిమిట్.. రోజుకు 80 వేలు మాత్రమే ఉండేది. తర్వాత.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఆ పరిమితిని మరో పది వేలు పెంచారు. ప్రస్తుతం.. వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 90 వేలకు పరిమితం చేశారు. అంతకుమించి.. భక్తులను అనుమతించొద్దని.. కేరళ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ.. రోజుకు లక్ష మందికి పైగా స్వాములు, భక్తులు.. శబరిమలకు వస్తున్నారు.

గత రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితులు, కఠిన ఆంక్షలతో.. భక్తులు, స్వాములు, అయ్యప్పను దర్శించుకోలేకపోయారు. అలాంటి వాళ్లంతా.. ఈసారి శబరిమలలో కోవిడ్ ఆంక్షలు సడలించడంతో.. ఒక్కసారిగా పోటెత్తారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయం తెరిచిన తొలి రోజు సాయంత్రమే.. 30 వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. అప్పుడే.. ఈ సీజన్‌లో భక్తులు భారీ సంఖ్యలో రాబోతున్నారని.. అంతా ఊహించారు. అందుకు తగ్గట్లుగానే.. మండల దీక్షను పూర్తి చేసుకొని.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శిస్తున్నారు. మాల ధరించిన స్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. గత వారం రోజులుగా.. ప్రతి రోజూ సుమారు లక్ష మంది భక్తులు ఆ మణికంఠ స్వామిని దర్శించుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి భక్తులు 10 గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయడం ఆలయ సిబ్బంది, పోలీసుల వల్ల కూడా కావడం లేదు. భక్తుల రద్దీ నిర్వహణకు చేపట్టిన చర్యలన్నీ పట్టు తప్పాయి.

వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శన స్లాట్‌ను బుక్ చేసుకున్న వాళ్లే కాకుండా.. స్పాట్ బుకింగ్, ఇతర మార్గాల ద్వారా రోజుకు దాదాపు 10 వేల మంది భక్తులు వస్తున్నారు. దీంతో.. శబరిమలపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తొక్కిసలాట పరిస్థితులను నివారించేందుకు.. పోలీసులు, అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక.. శబరికి వచ్చే భక్తులు.. ఎంత రద్దీ ఉన్నా వెనుకడుగు వేయడం లేదు.. స్వామిని దర్శించుకున్నాకే.. తిరుగుముఖం పడుతున్నారు. అటు.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కూడా.. ఎవరినీ వెనక్కి తిప్పి పంపడం లేదు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో లోపాలు తలెత్తితే.. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక.. భక్తుల రద్దీకి తగ్గట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. మంత్రి కె.రాధాకృష్ణన్ ఎప్పటికప్పుడు శబరిమలలో నెలకొన్న పరిస్థితులను, భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై.. జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో.. చర్చిస్తున్నారు. రద్దీకి తగ్గట్లుగా తక్షణ ఏర్పాట్లు చేయాలని సూచిస్తూనే ఉన్నారు. అలాగే.. చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న యాత్రికుల భద్రతకు సంబంధించి కూడా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొక్కిసలాట జరిగే పరిస్థితులకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేయడం మీదే పోలీసులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు దృష్టి పెట్టింది.

ఈ మండల మకరవిలక్కు సీజన్ మొదలైన 28 రోజుల్లోనే.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు 148 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిని బట్టే.. శబరిగిరీషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఏ స్థాయిలో తరలివస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్‌ మొత్తంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు 151 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సీజన్‌లో.. ఇప్పటికే ఆ మార్క్‌ని దాటేసింది ఆదాయం. వచ్చే జనవరి 21 నాటికి మకరవిలక్కు సీజన్ ముగుస్తుంది. అప్పటివరకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి.