CAA కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ అసెంబ్లీ

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 08:42 AM IST
CAA కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ అసెంబ్లీ

Updated On : December 31, 2019 / 8:42 AM IST

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేర‌ళ‌లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని స్ప‌ష్టం చేశారు.

కేర‌ళ‌లో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు ఉండ‌వ‌ని ఆయ‌న పేర్కోన్నారు. కేరళకు లౌకిక రాష్ట్రమన్న గుర్తింపు ఉందని తెలిపారు. గ్రీకులు, అరబ్బులు, రోమన్లు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ప్రతి ఒక్కరు కేరళలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. కేరళకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని వాటిని కాలరాసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేదిలేదని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు.  అంద‌ర్నీ క‌లుపుకుని పోవ‌డ‌మే కేర‌ళ సాంప్ర‌దాయ‌మ‌ని, ఆ సాంప్ర‌దాయాన్ని నిలుపుకోవాల‌ని సీఎం తెలిపారు.  

రాజకీయ పార్టీలు, మతాధిపతులు, సామాజిక నేతలతో జరిగిన ఒక సమావేశంలో వారంతా పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్నట్లు తనతో, ప్రతిపక్షనాయకుడితో చెప్పినట్లు విజయన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి ఎమ్మెల్యే జేమ్స్ మాథ్యూ  తో సహా పలువురు ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ప‌లికారు… కాగా.. ఎన్ఆర్‌సీ, సీఏఏ ఒకే నాణానికి రెండు వైపులా బొమ్మా, బొరుసని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.