Kerala HC : లక్షద్వీప్ కొత్త నిబంధనల నిలుపుదలకు కేరళ హైకోర్టు తిరస్కరణ
లక్షద్వీప్ యంత్రాంగం తాజాగా తీసుకొచ్చిన సంఘ విద్రోహ చర్యల నిరోధక చట్టం(PASA)మరియు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021(LDAR)డ్రాఫ్ట్ అమలును నిలిపేసేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

Kerala Hc Declines To Stay New Draft Regulation In Lakshadweep
Kerala HC లక్షద్వీప్ యంత్రాంగం తాజాగా తీసుకొచ్చిన సంఘ విద్రోహ చర్యల నిరోధక చట్టం(PASA)మరియు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021(LDAR)డ్రాఫ్ట్ అమలును నిలిపేసేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అయితే దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని జస్టిస్ కే వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్..లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌కు,కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత కేపీ నౌషాద్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ చర్యలు తీసుకుంది.
అయితే కొత్త నిబంధనల అమలుపై మధ్యంతర స్టే విధించాలని అలీ తరపున లాయర్ కోర్టుని కోరగా..ఇది విధానపరమైన అంశమని, తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం అన్ని పార్టీలకు లభించాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. లక్షద్వీప్‌పై అధికార పరిధి కేరళ హైకోర్టుకు ఉన్న సంగతి తెలిసిందే.
కొత్త రూల్స్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని అలీ తన పిటిషన్ లో ఆరోపించారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌కు దీనివల్ల ఎదురు లేని, బలమైన అధికారాలు లభిస్తాయని ఆరోపించారు. లక్షద్వీప్ వాసులు ఆస్తులను కలిగియుండటంపై కూడా ప్రభావం పడుతుందన్నారు.
కాగా, లక్షద్వీప్ కు కొత్త రూపం పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేషర్ ప్రపుల్ కే పటేల్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ పటేల్ నియంత పోకడలు అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆయన వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా లక్షద్వీప్ లో ప్రపుల్ కే పటేల్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాంతం యువత సోషల్ మీడియా ద్వారా సేవ్ లక్షద్వీప్ ఉద్యమాన్ని ప్రారంభించింది.
లక్షద్వీప్ లో కొత్తగా మారిందేంటీ
ఇప్పటివరకు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,మత్స్య,పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా,వాటిని అడ్మినిస్ట్రేటర్ పరిపాలన కిందకు తీసుకొచ్చారు.
ఇక్కడ మొన్నటివరకు మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు
లక్షద్వీప్ లో నేరాల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ గూండా చట్టాన్ని అమలుచేశారు
లక్షద్వీప్ లో అధికసంఖ్యలో మైనార్టీలు ఉంటారు. వారంతా మాంసాహారులు. అయినప్పటికీ జంతువధను, బీఫ్ ను నిషేధించారు.
తగిన పత్రాలు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాల పేరుతో చాలామంది ఇళ్లను కూలగొట్టారు. ఈ విషయంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలున్నాయి
కేరళలోని బైపూర్ నౌకాశ్రయం నుంచి అక్కడికి సరుకులు రవాణా అవుతుంటాయి. అయితే కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు.