Single Mother : ఒంటరి మహిళ కథ.. నిమ్మరసం అమ్మిన చోటే.. ఎస్ఐగా విధులు
10 ఏళ్ల క్రితం నిమ్మరసం అమ్మిన ప్రాంతానికే ఎస్ఐ గా తిరిగి వచ్చింది ఓ మహిళ. కేరళకు చెందిన ఈమె బ్రతుకుదెరువు కోసం నిమ్మరసం అమ్మారు. అనంతరం 2016 జరిగిన పోలీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నిమ్మరసం అమ్మిన ప్రాంతంలోనే ఎస్ఐ గా విధులు నిర్వహించేందుకు వచ్చారు.

Single Mother
పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివిపై స్థాయికి ఎదిగిన వారు చాలామందే ఉంటారు. వారు విజయం సాధించిన తర్వాత వారి జీవిత కష్టాలను కథలు కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఓర్చుకొని జీవితంలో విజయం సాధించిన తర్వాత వారు హీరోలుగా నిలుస్తారు. వారే ఈ సమాజానికి ఆదర్శం అవుతారు. ఆలా పేదరికంలో పుట్టి చిన్న వయసులోనే తల్లిదండ్రులతో గొడవపడి పెళ్లి చేసుకొని, భర్త వదిలేసి వెళ్లడంతో రోడ్డునపడ్డ ఓ మహిళ, ఎన్నో కష్టాలను ఓర్చి పోలీస్ అధికారిగా ఎంపికైంది. ఆమె విజయగాథనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం..
వివరాల్లోకి వెళితే. కేరళకు చెందిన ఎస్.పీ ఆనీ(31) అనే మహిళ 10 ఏళ్ల క్రితం జీవనం కోసం నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మింది. ఇప్పడు అదే ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది.
ఒకసారి ఈమె గురించి తెలుసుకుందాం
తిరువనంతపురం జిల్లాలోని కంజిరాంకుళంకు చెందిన ఎస్.పీ ఆనీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి వేరుకాపురం పెట్టింది.. రెండేళ్లకు వారికి కొడుకు పుట్టాడు.. ఆ తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఆమెను ఆదరించలేదు, దీంతో అమ్మమ వద్ద ఉంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ గా ఉద్యోగం చేసింది. ఇంటింటికి తిరుగుతూ వస్తువులు అమ్మింది. కొద్దీ రోజులకు అమ్మమ వద్దనుంచి బయటకు వచ్చింది.
కొడుకుతోపాటు బయటకు వచ్చిన ఆనీకి అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ఒంటరి మహిళకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో రోడ్డుపై ఉంటూ చిన్న చితక పనులు చేసుకుంటూ కొద్దీ రోజులు గడిపింది. రాత్రి సమయంలో బయట తిరుగుతుంటే ఇబ్బందులు రావడంతో ఆమె తన జుట్టును కత్తిరించుకొని పురుషుడిలా మారిపోయింది. ఇక ఇదే సమయంలో వర్కాలా పట్టణంలో నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మడం ప్రారంభించారు ఆనీ, ఓ వైపు నిమ్మరసం అమ్ముతూనే దూరవిద్య ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
2015లో కేరళ పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆనీ బంధువు ఒకరు ఆమెకు ఈ విషయం తెలిపాడు. ముందు ఆమె ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సుముఖత చూపలేదు. ఎలాగోలా నచ్చచెప్పి ఆమె చేత దరఖాస్తు చేయించాడు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ మొత్తం పూర్తి చేసుకొని 2016 బ్యాచ్ లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు.
అనంతరం ట్రైనింగ్ ప్రారంభమైంది. 18 నెలల ట్రైనింగ్ తర్వాత విధుల్లో చేరారు అనీ.. ఆమె ఎక్కడైతే నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మారో అక్కడే సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఇక ఈ సందర్బంగా ఆమె పేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. “పదేళ్ల క్రితం వర్కాల శివగిరి తీర్థయాత్రకు వచ్చే ప్రజలకు నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మేదాన్ని ఈ రోజు, నేను పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ గా అదే స్థలానికి తిరిగి వచ్చానని పేర్కొన్నారు. ఈ పోస్టును చూసిన చాలామంది ప్రముఖులు ఆమెను మెచ్చుకుంటున్నారు. మీ జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆనీ విజయగాథను తెలుసుకున్న చాలామంది ఆమెను ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.
ఇక ఆనీ గురించి తెలుసుకొని కేరళ ఆరోగ్య శాఖామంత్రి మంత్రి వీణా జార్జ్ పేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. నమ్ముకొని వచ్చిన భర్త, కన్నవారు ఆమెను మధ్యలోనే వదిలేశారు. తనబిడ్డను స్వయంగా పెంచుకుంటూ ఎన్నో కష్టాలు పడింది. పనిచేసుకుంటూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం సాధించింది. ఆమె జీవితంలో ప్రపంచంలోని మహిళలకు ఆదర్శం అంటూ తెలిపారు.